ICC: బాబ‌ర్‌ను కింద‌కు నెట్టేసిన రిజ్వాన్‌... టాప్10 ర్యాంకుల్లో ఇద్ద‌రే భార‌తీయులు

  • టీ20 ర్యాంకింగ్స్‌ను విడుద‌ల చేసిన ఐసీసీ
  • బ్యాట‌ర్ల‌లో రెండు స్థానాలు దిగ‌జారిన సూర్య‌కుమార్ యాద‌వ్‌
  • ఆల్ రౌండ‌ర్ల‌లో 5వ స్థానంలో కొన‌సాగుతున్న పాండ్యా
  • బాబ‌ర్ టాప్ ప్లేస్‌ను చేజిక్కించుకున్న రిజ్వాన్‌
Mohammad Rizwan downs his captain babar azam in icc t20 ranks

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కీల‌క సిరీస్‌గా ప‌రిగ‌ణిస్తున్న ఆసియా క‌ప్ కొన‌సాగుతున్న త‌రుణంలోనే టీ20 ర్యాంకుల‌ను ఐసీసీ బుధ‌వారం విడుద‌ల చేసింది. ఈ ర్యాంకుల్లో భార‌త క్రికెట‌ర్లు పెద్ద‌గా రాణించ‌లేక‌పోగా... పాకిస్థాన్ క్రికెట‌ర్లు మాత్రం టాప్ ర్యాంకుల కోసం కుస్తీలు ప‌డుతున్నారు.

టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో టాప్‌లో కొన‌సాగుతున్న పాక్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ తాజా ర్యాంకుల్లో టాప్ ప్లేస్‌ను చేజార్చుకున్నాడు. అయితే అత‌డి స్థానంలో పాక్‌కే చెందిన స్టార్ క్రికెట‌ర్‌, భార‌త్‌పై పాక్ నెగ్గిన మ్యాచ్‌లో కీల‌క ఇన్నింగ్స్ ఆడిన మ‌హ్మ‌ద్ రిజ్వాన్ నిలిచాడు. ఇక బ్యాటింగ్‌లో రెండో ర్యాంకులో ఉన్న భార‌త ఆట‌గాడు సూర్య కుమార్ యాద‌వ్ ఒకేసారి రెండు స్థానాలు దిగ‌జారి నాలుగో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

శ్రీలంక‌తో మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శ‌ర్మ మూడు స్థానాలు ఎగ‌బాకి 14 ర్యాంకులో కొన‌సాగుతున్నాడు. ఇక నిల‌క‌డ‌లేమితో స‌త‌మ‌త‌మ‌వుతున్న విరాట్ కోహ్లీ కూడా నాలుగు స్థానాలు ఎగ‌బాకి 29వ ర్యాంకులో కొన‌సాగుతున్నాడు. బ్యాటింగ్‌లో టాప్ 10 ర్యాంకుల్లో సూర్యకుమార్ యాద‌వ్ మిన‌హా మ‌రే ఇత‌ర బ్యాట‌ర్ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

అదే స‌మ‌యంలో బౌలింగ్ ర్యాంకుల్లో కూడా టాప్ 10లో ఒక్క భారతీయుడు కూడా లేడు. ఆల్ రౌండ‌ర్ల ర్యాంకుల్లో హార్దిక్ పాండ్యా ఒక్క‌డే టాప్ 10లో ఉన్నాడు. ఆల్ రౌండ‌ర్ల‌లో అత‌డు 5వ స్థానంలో కొన‌సాగుతున్నాడు. వెర‌సి టాప్ 10 ర్యాంకుల్లో ఇద్ద‌రు భార‌తీయులు మాత్ర‌మే కొన‌సాగుతున్నారు.

More Telugu News