లిఫ్ట్​ లో చిన్నారిని కరిచిన కుక్క.. ఏ మాత్రం చలించని యజమానికి రూ. 5 వేల జరిమానా

07-09-2022 Wed 11:40 | National
  • యూపీలోని ఘజియాబాద్ లో ఖరీదైన కౌంటీ సొసైటీలో ఘటన
  • కుక్క కరిచి ఏడుస్తున్న చిన్నారిని పట్టించుకోని మహిళ
  • రూ. 5 వేల జరిమానా విధించిన మున్సిపల్ కార్పొరేషన్ 
 Woman fined Rs 5000 after pet dog bites child in lift
పెంపుడు కుక్క ఓ చిన్న పిల్లవాడిని కరిచిన కారణంగా ఆ యజమానికి మున్సిపల్ కార్పొరేషన్ రూ. 5 వేల జరిమానా విధించింది. ఈ సంఘటన ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. ఈనెల ఐదో తేదీ సాయంత్రం స్కూలు నుంచి తిరిగొచ్చిన ఓ బాలుడు ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్ చార్మ్స్ కౌంటీ సొసైటీలో ఇంటికి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు. అప్పటికే ఒక మహిళ తన పెంపుడు కుక్కతో కలిసి లిఫ్ట్‌లోకి వచ్చింది. కాసేపటికే ఆ కుక్క పిల్ల... బాలుపైకి దూకి అతడిని కరిచింది. 

ఆ చిన్నారి నొప్పితో అరుస్తున్నప్పటికీ ఆ మహిళ ఏ మాత్రం చలించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అతడిని పట్టించుకోకుండా వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు నంద్‌గ్రామ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకున్న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది. ఘటన తర్వాత ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మహిళ ఇంటికి చేరుకుని పెంపుడు కుక్క వివరాలను నమోదు చేయలేదని గుర్తించారు. ఆమెకు రూ. 5 వేల జరిమానా విధించారు.