Uttar Pradesh: పట్టపగలు నడిరోడ్డుపై చితక్కొట్టుకున్న పోలీసులు.. వీడియో ఇదిగో

UP Police Cops Engaged In Physical Violence Video Goes Viral On Internet
  • ఉత్తరప్రదేశ్‌లోని జలాన్‌లో ఘటన
  • హోంగార్డు, కానిస్టేబుల్ మద్య మద్యం విషయంలో తలెత్తిన వివాదం
  • కానిస్టేబుల్‌పై వేటేసిన ఉన్నతాధికారులు
ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు పోలీసులు కలబడ్డారు. నడిరోడ్డుపైనే కుమ్మేసుకున్నారు. జలాన్‌లోని జగమ్మన్‌పూర్‌ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ హోంగార్డు, కానిస్టేబుల్‌ నడిరోడ్డు మీదే కుమ్మేసుకున్నారు. మద్యం విషయంలో జరిగిన గొడవే ఇందుకు కారణమని తెలుస్తోంది. తొలుత ఇద్దరి మధ్య ప్రారంభమైన వాగ్వివాదం కాస్తా ముదిరి కొట్లాటకు దారి తీసింది. దీంతో చెలరేగిపోయిన కానిస్టేబుల్.. హోంగార్డుపై ముష్టిఘాతాలు కురిపించాడు. కాళ్లతో తంతూ చెలరేగిపోయాడు. 

ఈ క్రమంలో ఇద్దరూ రోడ్డు పక్కనే ఉన్న పొదల్లో పడ్డారు. కిందపడ్డాక హోంగార్డుపై కానిస్టేబుల్ మరింతగా చెలరేగిపోయాడు. ఆగకుండా పిడిగుద్దులు కురిపించాడు. మరో కానిస్టేబుల్ వారిని విడిపించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దాదాపు గంటపాటు వారిద్దరి మధ్య ఫైట్ జరిగింది. 

అలా పట్టపగలు నడిరోడ్డుపై వీరిద్దరూ కొట్లాడుకుంటుంటే దారినపోయే వారు వాహనాలు ఆపి మరీ చూస్తుండిపోయారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. అది కాస్తా పోలీసు పెద్దల దృష్టికి చేరడంతో ఇద్దరినీ విచారించారు. అనంతరం కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.

Uttar Pradesh
Police Constable
Home Gaurd
Viral Videos

More Telugu News