Telangana: హైద‌రాబాద్‌లో వ‌ర‌ల్డ్ క్లాస్ సైకిల్ ట్రాక్‌కు శంకుస్థాప‌న చేసిన కేటీఆర్‌

ts minister ktr lays foundation for world class cycling track in hyderabad
  • నాన‌క్‌రామ్‌గూడ్ వ‌ద్ద శంకుస్థాప‌న చేసిన కేటీఆర్‌
  • తొలి ద‌శ‌లో 23 కిలోమీట‌ర్ల మేర సైక్లింగ్ ట్రాక్‌
  • 6 నెల‌ల్లోనే ట్రాక్‌ను పూర్తి చేయ‌నున్నామ‌న్న మంత్రి
భాగ్యన‌గ‌రి హైద‌రాబాద్ సిగ‌లో ఆరు నెల‌ల్లోనే మ‌రో కీల‌క నిర్మాణం చేర‌నుంది. వ‌ర‌ల్డ్ క్లాస్ సైక్లింగ్ ట్రాక్‌కు తెలంగాణ మునిసిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం భూమి పూజ చేశారు. హైద‌రాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్డు మీద నానక్ రామ్ గూడ‌, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడెమీ, నార్సింగి, కొల్లూర్ ల స‌మీపంలో 23 కిలోమీట‌ర్ల మేర వ‌ర‌ల్డ్ క్లాస్ ప్ర‌మాణాల‌తో ఈ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు కానుంది. ఈ ట్రాక్ వెంట పైన మొత్తంగా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు కానుండ‌గా... ఆ ప్యానెళ్ల నీడలో సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు కానుంది. ఈ సోలార్ ప్యానెళ్ల ద్వారా 16 మెగా వాట్ల విద్యుదుత్పత్తి జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

మూడు లేన్ల‌తో 4.5 మీట‌ర్ల వెడ‌ల్పుతో ఏర్పాటు కానున్న ఈ ట్రాక్ కు నానక్ రామ్ గూడ వద్ద కేటీఆర్ భూమి పూజ చేశారు. కేవ‌లం ఆరు నెల‌ల్లోనే ఈ ట్రాక్‌ను పూర్తి చేయ‌నున్న‌ట్లు కేటీఆర్ ప్ర‌క‌టించారు. ఇదివ‌ర‌కే ఇచ్చిన హామీ మేర‌కు ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఆయన పేర్కొన్నారు. ఈ 23 కిలోమీట‌ర్ల నిడివి క‌లిగిన ట్రాక్ ప్రారంభ‌మేన‌న్న కేటీఆర్‌... భ‌విష్య‌త్తులో ఇలాంటి ట్రాక్‌ల‌ను న‌గ‌ర వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామ‌ని వెల్ల‌డించారు.
Telangana
TRS
KTR
ORR
Hyderabad
Cycling Track
Solar Roof

More Telugu News