seat belt: సీటు బెల్ట్ విషయంలో ఇక కఠిన నిబంధనలు!

Centre plans to ban seat belt alarm stoppers after Cyrus Mistrys death
  • అలారమ్ వ్యవస్థలో మార్పులు
  • మధ్య సీట్లకూ బెల్ట్ లు
  • క్లిప్పులు లేకుండా చర్యలు
  • త్వరలోనే కొత్త ఆదేశాలు
  • వెల్లడించిన అధికార వర్గాలు

మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల కింద కారులో ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ విధిగా ధరించాలి. కానీ, పరిశీలించి చూస్తే ఈ నిబంధనను అనుసరించే వారు చాలా తక్కువగా కనిపిస్తారు. ప్రమాదాల సమయంలో వాహనదారుల ప్రాణాలను కాపాడడంలో ముందుగా సాయపడేది సీట్ బెల్ట్. సీటు బెల్ట్ ధరించకపోతే కారులో అలారమ్ మోగుతూనే ఉంటుంది. దీంతో కారులోని వారు సీటు బెల్ట్ ను ఉత్తిగా లాక్ చేసేసి, దాన్ని ధరించకుండా కూర్చుంటున్నారు. అలాగే, సీట్ బెల్ట్ ధరించకపోతే హెచ్చరించే అలారమ్ వ్యవస్థ ముందు సీటులోని వాటికే ఉంటోంది. వెనుక సీట్లో ఉండడం లేదు.

షాపూర్ జీ పల్లోంజీ గ్రూపు వారసుడైన సైరస్ మిస్త్రీ సీటు బెల్ట్ ధరించక ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. నిబంధనలను కఠినతరం చేసే విషయమై కేంద్రం దృష్టి సారించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.  ఇందుకు సంబంధించి కేంద్ర రవాణా శాఖ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. సీట్ బెల్ట్ అలారమ్ ను ఆపేయడాన్ని నిషేధించనుంది. కారులో ఆరు ఎయిర్ బ్యాగ్ లను తప్పనిసరి చేయనుంది. కారు సీటు మధ్య భాగంలో ముందు, వెనుక కూడా సీటు బెల్ట్ ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వనుంది. సీట్ బెల్ట్ ధరించడం ఎంత ముఖ్యమో ప్రచారం నిర్వహించనుంది.

ఈ ఆదేశాలను తాము రూపొందిస్తున్నామని, త్వరలోనే వీటిని ప్రకటించనున్నట్టు కేంద్ర రవాణా శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. సీటు బెల్ట్ లకు క్లిప్పులను నిషేధించనున్నట్టు చెప్పారు. కారులో సీటు బెల్ట్ ధరించకపోతే ఆటోమేటిగ్గా గుర్తించి చర్యలు తీసుకునే వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్టు ఇటీవలే కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సైతం ప్రకటించడం గమనార్హం.

  • Loading...

More Telugu News