contraceptive methods: అందుబాటులో ఉన్న వివిధ రకాల గర్భనిరోధక సాధనాలు!

  • మహిళల కోసం ఉన్నవే ఎక్కువ
  • అన్నింటికంటే సులభమైనది కండోమ్
  • కాంట్రెసెప్టివ్ పిల్స్ కూడా సులభ మార్గమే
  • ఐయూడీ, కాంట్రాసెప్టివ్ రింగ్ కూడా వాడుకోవచ్చు
Different contraceptive methods for women and men

గర్భ నిరోధక సాధనాల వల్ల అవాంఛిత గర్భాలను నిరోధించొచ్చు. అంతేకాదు, లైంగిక వ్యాధులను (సుఖ వ్యాధులు) కూడా నివారించొచ్చు. హెచ్ఐవీ అరక్షిత లైంగిక కార్యకలాపాల ద్వారా వ్యాపిస్తుందని తెలిసిందే. కొత్తగా పెళ్లయిన దంపతులు కొంత కాలం పాటు పిల్లలు వద్దనుకోవచ్చు. లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత శస్త్రచికిత్సలు లేకుండా నిరోధక సాధనాలను వాడుకోవాలని కోరుకోవచ్చు. కొందరు అసంకల్పిత లైంగిక చర్య వల్ల గర్భం దాల్చొచ్చు. కారణాలు ఏవైనా గర్భం రాకుండా చూసుకునేందుకు పలు మార్గాలు ఉన్నాయి. పురుషులతో పోలిస్తే మహిళలకు ఎక్కువ సాధనాలు ఉన్నాయి. 

కాంట్రాసెస్టివ్ పిల్స్  
ఇందులో కాంట్రాసెస్టివ్ పిల్స్ సులభ మార్గం. ఎన్నో దశాబ్దాల నుంచి భారతీయ మహిళలకు అందుబాటులో ఉన్నదే ఇది. పలు రకాల ఔషధాలు మార్కెట్లో ఉన్నాయి. వీటిని వైద్యుల సిఫారసు మేరకు వాడుకోవాలి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ తో ఈ పిల్స్ ఉంటాయి.

ఇంట్రా యుటెరిన్ డివైజ్ (ఐయూడీ)
ఇది టీ ఆకారంలో ఉండే పరికరం. ప్లాస్టిక్ లేదా కాపర్ తో తయారు చేస్తారు. దీన్ని మహిళల గర్భాశయం (యుటెరస్)లోకి ప్రవేశపెడతారు. కొన్నేళ్ల పాటు ఇది పనిచేస్తుంది. వద్దనుకున్నప్పుడు దీన్ని తొలగించుకుంటే, తిరిగి గర్భం దాల్చేందుకు ఎలాంటి ఆటంకం ఉండదు.

కాంట్రాసెప్టివ్ రింగ్
ఇది ప్లాస్టిక్ రింగ్. మహిళల జననాంగంలోకి ప్రవేశపెడతారు. ఇది ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ హార్మోన్లను విడుదల చేస్తుంటుంది. కొన్ని వారాల వరకు దీన్ని ఉంచుకుని, తర్వాత తీసేయవచ్చు. మరొకటి ధరించొచ్చు. 

డయాఫ్రమ్
ఇది చిన్న పరిమాణంలో ఉండే సిలికాన్ డోమ్. పురుషుల వీర్యం మహిళల గర్భాశయంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. దీన్ని కూడా యోనిలోనే ఏర్పాటు చేస్తారు. ఎప్పుడూ ధరించి ఉంచుకునేది కాదు. ఆరు గంటల తర్వాత తీసి శుభ్రం చేసుకుని, తిరిగి కావాల్సినప్పుడు ధరించేది. 

కండోమ్
మొదటి నుంచి ఉన్న గర్భనిరోధక సాధనాల్లో ఇదీ ఒకటి. అత్యంత తేలికైన, సురక్షితమైనది. కండోమ్స్ లో మహిళలు, పురుషుల కోసం వేర్వేరు రకాలు ఉన్నాయి. ఎవరో ఒకరు ధరించడం ద్వారా గర్భం రాకుండా చూసుకోవచ్చు.

స్టెరిలైజేషన్
మహిళలకు గర్భధారణ అవకాశాలను పూర్తిగా తొలగించే శస్త్రచికిత్స ఇది. గర్భనిరోధానికి ఇది శాశ్వత పరిష్కారం. మహిళలకు చేసే విధానాన్ని ట్యూబల్ లిగేషన్ (ట్యూబెక్టమీ) అంటారు. పురుషులకు చేసే దాన్ని వాసెక్టమీ లేదా వాసో లిగేషన్ అని చెబుతారు. మహిళలకు చేసే ప్రక్రియలో గర్భధారణకు కీలకమైన ఫాలోపియన్ ట్యూబ్ లను మూసేస్తారు. శస్త్రచికిత్స ద్వారా చేసే విధానం ఇది.

పురుషులకు చేసే వాసెక్టమీలో.. టెస్టికల్స్ నుంచి ప్రొస్టేట్ కు అనుసంధానించే ట్యూబ్ లను కత్తిరించి మూసేస్తారు. దీంతో టెస్టికల్స్ లో వీర్యం తయారీ ఆగిపోతుంది. మహిళల్లోనే వివిధ కారణాల వల్ల గర్భాశయాన్ని తొలగించే హిస్టెరెక్టమీ, పురుషుల్లో టెస్టికల్స్ ను తొలగించే క్యాస్ట్రేషన్ కూడా ఉన్నాయి.

More Telugu News