దేశ రాజకీయాలకు పోదామా...?: నిజామాబాద్ సభలో కేసీఆర్

05-09-2022 Mon 17:11 | Telangana
  • నిజామాబాద్ లో కేసీఆర్ పర్యటన.. బహిరంగ సభ 
  • జాతీయ రాజకీయాల్లో ప్రస్థానం ప్రారంభిస్తున్నామని వెల్లడి
  • దేశాన్ని కూడా బాగు చేసుకుంటామని ఉద్ఘాటన
KCR asks people shall we go to national Politics
నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగించారు. 'పోదామా దేశ రాజకీయాలకు?' అంటూ ప్రజలను అడిగారు. 2024లో బీజేపీ రహిత ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నిజామాబాద్ నుంచి పిలుపునిస్తున్నానని, తెలంగాణ రైతాంగం మాదిరే యావత్ భారతదేశ రైతాంగానికి ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇస్తున్నామని తెలిపారు. 

దేశం కోసం తెలంగాణ నుంచే పోరాటం చేయాలని అన్నారు. ఎవరైతే బావుల వద్ద మీటర్ పెట్టాలంటున్నారో, ఎవరైతే రైతులను ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోవాలంటున్నారో వారికే మనం మీటర్ పెట్టాలి... అప్పుడే మనం బాగుపడతాం అంటూ ఆవేశపూరితంగా ప్రసంగించారు. 

ఉన్నవి అమ్ముకోవడం తప్ప ఈ మోదీ ఒక్క ప్రాజెక్టు అయినా కట్టాడా? ఒక్క ఫ్యాక్టరీ అయినా పెట్టాడా? అంటూ నిలదీశారు. ఇప్పుడు మోటర్లకు మీటర్లు పెట్టి అన్నీ గుంజుకుంటే మనం శంకరగిరి మాన్యాలు పట్టి కూలిపనులు చేయాలి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ప్రతి గ్రామంలో రైతు బిడ్డలు, రైతు సంఘాలు సమావేశమై, ఏ పార్టీ రైతు వ్యతిరేక విధానాలు అవలంబించినా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో నిరుద్యోగిత పెరిగిపోయిందని, రూపాయి విలువ పడిపోయిందని, ఎవరినీ ఉద్ధరించింది లేదని విమర్శించారు. 

దేశం అంతర్జాతీయంగానూ పరువు పోయే పరిస్థితిలో నిలిచిందని అన్నారు. ప్రతిపక్షాలను చీల్చుతూ, రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసుకుంటూ అహంకారంతో, మదంతో ముందుకెళుతున్నారని బీజేపీపై పరోక్షంగా మండిపడ్డారు. 

"ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం, నిన్ను దించేస్తాం అంటున్నారు. ఆనాడు నేనొక్కడ్నే... మీరందరూ కలిస్తే సముద్రమై ఉప్పొంగి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు ప్రజాస్వామ్య, లౌకిక భారతదేశం కోసం కొట్లాడాల్సిన సమయం వచ్చింది. మరి దేశ రాజకీయాలను మార్చేందుకు ముందుకు వెళదామా? తెలంగాణను ఏ విధంగా బాగు చేసుకున్నామో, దేశాన్ని కూడా అదే రీతిలో బాగు చేసుకుందాం. ఈ నిజామాబాద్ సాక్షిగా చెబుతున్నా... త్వరలోనే జాతీయ రాజకీయాల్లో ప్రస్థానం ప్రారంభిస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో ఎగిరేది బీజేపీయేతర జెండానే" అని కేసీఆర్ స్పష్టం చేశారు.