cyrus mistry: మిస్త్రీ మరణం తర్వాత షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ బాధ్యత ఎవరిది?

  • సైరస్ ముత్తాత ప్రారంభించిన  ఎస్ పీ కంపెనీకి 157 ఏళ్ల చరిత్ర
  • 50కి పైగా దేశాల్లో 30 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీ
  • టాటా కంపెనీలో 18.6 శాతం వాటా
After Cyrus Mistry Death Who Controls 30 Billion dollar Shapoorji Pallonji Group

టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో కన్నుమూయడం భారత వ్యాపార రంగంలో  విషాదాన్ని మిగిల్చింది. మిస్త్రీ మరణంతో 157 ఏళ్ల చరిత్ర, ఎన్నో బిలియన్ డాలర్ల ఆదాయం ఉన్న షాపూర్జీ పల్లోంజీ (ఎస్ పీ) గ్రూప్‌ భవిష్యత్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. సైరస్ తండ్రి ఈ గ్రూప్ సీఈవో పల్లోంజి మిస్త్రీ గత జూన్ చివర్లో  మరణించారు. 'ది ఫాంటమ్ ఆఫ్ బాంబే హౌస్'గా అయన ఎంతో పేరు గడించారు. 

ఇక ఇప్పుడు పల్లోంజి చివరి వారసుడైన సైరస్ కూడా మృతి చెందడంతో ఈ గ్రూప్ బాధ్యతలు ఎవరు తీసుకుంటారన్నది చర్చనీయాంశమైంది. 1865లో సైరస్ ముత్తాత సీనియర్ పల్లోంజి మిస్త్రీ స్థాపించిన 30 బిలియన్ డాలర్ల విలువైన ఎస్ పీ కంపెనీకి...టాటా గ్రూప్‌లో 18.6 శాతం వాటా ఉంది. 

అక్టోబరు 2016లో టాటా గ్రూప్‌తో జరిగిన బోర్డు తిరుగుబాటులో సైరస్ మిస్త్రీని గ్రూప్ చైర్మన్‌గా తొలగించిన తర్వాత మిస్త్రీ, టాటా మధ్య గొడవ భారతదేశంలో అతిపెద్ద కార్పొరేట్ వైరాన్ని రేకెత్తించింది. సైరస్ పర్యవేక్షణలో టాటా గ్రూప్ 12.5 శాతం వృద్ధి చెందింది. కానీ, అప్పు రూ.1.89 లక్షల కోట్ల నుంచి రూ. 2.29 లక్షల కోట్లకు పెరిగింది.

 మరోవైపు రియల్ ఎస్టేట్, కన్స్యూమర్ గూడ్స్, సౌర విద్యుత్, ఇంజనీరింగ్, నిర్మాణ రంగాల్లో 50 కంటే ఎక్కువ దేశాల్లో విస్తరించిన ఎస్ పీ కంపెనీలో  50,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. డిసెంబర్ 2012లో టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా నియమితులైనప్పటి నుంచి సైరస్ తన కుటుంబ వ్యాపార కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. వాటిని  తన అన్న షాపూర్ మిస్త్రీకి అప్పగించారు. 

2019 చివరి నుంచి ఎస్ పీ గ్రూప్ లో పలు మార్పులు వచ్చాయి. షాపూర్ కుమారుడు 26 ఏళ్ల పల్లోన్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ బోర్డులోకి వచ్చారు. ఆయన కుమార్తె తాన్య గ్రూప్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇప్పుడు సైరస్ మరణం తర్వాత  షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ యాజమాన్యంలో మార్పు వస్తుందా? గ్రూప్ ను ఎవరు కంట్రోల్ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. మిస్త్రీకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కానీ, 2003లో వాళ్లు భారత పౌరసత్వాన్ని వదిలేసి ఐర్లాండ్ పౌరసత్వం తీసుకున్నారు. ఇప్పుడు వాళ్లు తిరిగి భారత్ వస్తారా? అన్న విషయం కూడా చర్చనీయాంశమైంది.

More Telugu News