Wine: ‘వైన్’ ఆరోగ్యానికి మంచిదేనా..? ఫలితాలు ఏం చెబుతున్నాయి?

  • వైన్ లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు
  • వీటితో గుండె ఆరోగ్యానికి మేలు
  • మధుమేహం నియంత్రణకు సాయం 
  • మోస్తరుగా తీసుకుంటేనే మంచి ఫలితాలు
Wine Health Benefits 6 Ways It Helps When Consumed In Moderation

మన దేశంలో వైన్ తాగే వారు తక్కువ. ఇది కూడా ఆల్కహాలే. మాగబెట్టిన ద్రాక్ష పండ్ల నుంచి వైన్ ను తయారు చేస్తారు. బ్రాందీ, విస్కీ, జిన్, రమ్, బీరుతో పోలిస్తే వైన్ లో ఆల్కహాల్ తక్కువ. అందుకనే మందుబాబులు వైన్ ను తీసుకోరు. కానీ, మోస్తరు పరిమాణంలో వైన్ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలు అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి.

వైన్ లో పాలీ ఫెనాల్స్ ఉంటాయని 2018 నాటి నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ నిర్వహించిన అధ్యయనం తెలిపింది. పాలీఫెనాల్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్లు. కనుక వైన్ ను పరిమితంగా తీసుకోవడం వల్ల గుండెకు మేలు చేస్తుంది. మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లను కూడా అడ్డుకుంటుందట. 

ప్రయోజనాలు..
రెడ్ వైన్ తీసుకోవడం వల్ల హానికారక కొలెస్ట్రాల్ తగ్గుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. కొలెస్ట్రాల్ ను తగ్గించడంతోపాటు ఇందులో ఉండే పాలీఫెనాల్స్ గుండె ఆరోగ్యానికి మంచి చేస్తాయి. వైన్ లోని రెస్ వెరట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ మధుమేహం నియంత్రణకు సాయపడుతుంది. ఒక అధ్యయనంలో రెస్ వెరట్రాల్ ను రోజువారీ 250 ఎంజీ చొప్పున, మూడు నెలల పాటు ఇచ్చి చూడగా, బ్లడ్ షుగర్ చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గినట్టు తేలింది.

ఇక వైన్ లో పరిమితంగా ఉండే ఆల్కహాల్ డిప్రెషన్ ను తగ్గిస్తుంది. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్న వారికి వైన్ ఒక ఔషధం, పరిష్కారం మాత్రం కాబోదు. వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడమే మెరుగైన మార్గం అవుతుంది. కాకపోతే డిప్రెషన్ తగ్గేందుకు సాయపడుతుంది. రెడ్ వైన్ ను పరిమితంగా తీసుకునే వారి ఆయుష్షు పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు గుర్తించాయి. వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు సైతం వైన్ సాయపడుతుంది. పరిమిత సేవనం అంటే 5ఓజెడ్. అంటే 148ఎంఎల్. 

నోట్: ఈ సమాచారం కేవలం అవగాహన కల్పించేందుకే. సూచన లేదా సిఫారసు ఎంత మాత్రం కాదని గమనించాలి.  ఏదైనా వైద్యుల సూచన మేరకే తీసుకోవాలి.

More Telugu News