Bihar: బీజేపీ 50 సీట్లకు పరిమితమవుతుందన్న వ్యాఖ్యలపై నితీశ్ కుమార్ యూటర్న్

  • జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం నితీశ్ వ్యాఖ్యలు
  • బీజేపీ-జేడీయూ మధ్య మాటల యుద్ధం
  • నంబరు గురించి తాను మాట్లాడలేదన్న సీఎం
Never spoke about how many seats BJP will get in 2024 polls

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లకు మించి రావంటూ చేసిన వ్యాఖ్యల నుంచి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెనక్కి తగ్గారు. తానలా అనలేదంటూ యూటర్న్ తీసుకున్నారు. శనివారం జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లకు మించి రావని వ్యాఖ్యానించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆయన వ్యాఖ్యలు జేడీయూ-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

నిన్నటి జేడీయూ సమావేశం అనంతరం.. బీజేపీపై చేసిన వ్యాఖ్యల గురించి మీడియా ప్రతినిధులు నితీశ్‌ను ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ.. బీజేపీ 50 సీట్లకు పరిమితమవుతుందని తాను చెప్పలేదన్నారు. ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడమే తన లక్ష్యమని, తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాను ఏ సంఖ్య గురించి మాట్లాడనని తేల్చి చెప్పారు.

మొన్న జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం జేడీయూ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమైతే బీజేపీకి 50 సీట్లకు మించి రావని నితీశ్ అన్నట్టు ఆ ప్రకటనలో ఉంది. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే విషయంలో తన ప్రయత్నం సఫలమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News