Harish Rao: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పై హరీశ్ రావు విమర్శనాస్త్రాలు

  • తెలంగాణలో పర్యటించిన నిర్మలా సీతారామన్
  • రేషన్ దుకాణాల్లో మోదీ ఫొటో లేకపోవడంపై ఆగ్రహం
  • ఘాటుగా స్పందించిన హరీశ్ రావు
  • ఫోటోల పట్ల రాద్ధాంతం ఎందుకంటూ విమర్శలు
Harish Rao criticizes Nirmala Sitharaman

తెలంగాణలోని రేషన్ దుకాణాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహావేశాలు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫొటో పెట్టారా? అని సూటిగా ప్రశ్నించారు. 

అంతేకాదు, ఆనాడు ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రధాని ఫొటో పెట్టారా? అని నిలదీశారు. కేంద్రం నిధులు ఇస్తోందని మోదీ ఫొటో ఏర్పాటు చేయాలనడం సరికాదని పేర్కొన్నారు. ఈ మేరకు పలు అంశాలతో హరీశ్ రావు ఓ ప్రకటన విడుదల చేశారు. 

తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ పట్ల, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన పట్ల సంపూర్ణ స్పష్టతతో ఉన్నారని హరీశ్ రావు వెల్లడించారు. తెలంగాణకు వచ్చి ఇక్కడి ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రయత్నంలో మీరే గందరగోళంలో పడినట్టు తెలుస్తోందని నిర్మలాను ఎద్దేవా చేశారు. మీ అసత్యాలను తెలంగాణ సమాజం నమ్మదు అని స్పష్టం చేశారు. 

ఫొటోల పట్ల రాద్ధాంతం చేయడం చూసి తెలంగాణ ప్రజలు విస్మయానికి గురవుతున్నారని వివరించారు. పథకాల పేరుతో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయడం తప్ప సమాఖ్య విలువలు పెంపొందించేందుకు కేంద్రం ఏంచేసిందని హరీశ్ ప్రశ్నించారు.

More Telugu News