India: 2030 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

Experts says India will reach third highest economy in the world by 2030
  • తాజాగా బ్రిటన్ ను వెనక్కినెట్టిన భారత్
  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఐదోస్థానానికి భారత్
  • మరింత ఎదుగుతుందంటున్న నిపుణులు
  • ఐఎంఎఫ్ దీ అదే మాట!
భారత్ తాజాగా బ్రిటన్ ను వెనక్కినెట్టి ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ 2030 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. 

ప్రపంచ ఆర్థిక శక్తుల సూచీలో భారత్ వేగంగా కదులుతోందని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ విర్మానీ పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న ఒరవడి చాలా ముఖ్యమైనదని, వివిధ రకాల భావనలను అది ప్రభావితం చేస్తుందని, విదేశీ విధానాలను, వివిధ దేశాలతో మన సరళిని ప్రభావితం చేస్తుందని తెలిపారు. గత 20-30 ఏళ్లుగా మనం చైనా కంటే ఎంత వెనుకబడి ఉన్నామో ప్రజలు గమనించడం ప్రారంభించారని, ఇప్పటివరకు ఉన్న ఆలోచనా దృక్పథాన్ని ఈ అంశం తప్పకుండా మార్చుతుందని విర్మానీ అన్నారు. 

రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ (ఆర్ఐఎస్) డైరెక్టర్ జనరల్ సచిన్ చతుర్వేది స్పందిస్తూ, ఆర్థికాభివృద్ధి అంశంలో మనం బ్రిటన్ ను అధిగమించడం ఇదేమీ ప్రథమం కాదని తెలిపారు. 2019లోనే బ్రిటన్ ను భారత్ వెనక్కినెట్టిందని వివరించారు. 

మనం మూలధన వ్యయంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని, రెవెన్యూ వ్యయాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ద్రవ్యోల్బణం అదుపునకు ఆర్బీఐ చేపడుతున్న వ్యూహాత్మక విధానాలు ఆర్థిక వ్యవస్థ ఎంతో సమతుల్య వాతావరణంలో కొనసాగేందుకు దోహదపడుతున్నాయని, అందుకు తగ్గట్టే మెరుగైన ఫలితాలు కూడా వస్తున్నాయని సచిన్ చతుర్వేది వివరించారు.

ప్రముఖ ఆర్థికవేత్త చరణ్ సింగ్ స్పందిస్తూ... ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ అని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) కూడా ఎప్పటినుంచో చెబుతోందని తెలిపారు. ద్రవ్యోల్బణం దాదాపుగా నియంత్రణలో ఉందని పేర్కొన్నారు. తక్కిన ప్రపంచం ఆర్థికంగా కుదేలైన పరిస్థితుల్లోనూ భారత్ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని చరణ్ సింగ్ వివరించారు. 

దశాబ్ద కాలం కిందట ప్రపంచ బలమైన ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ 11వ స్థానంలో ఉండగా, బ్రిటన్ ఐదో స్థానంలో ఉండేది. కానీ, వేగంగా ఎదిగిన భారత్ 854 బిలియన్ డాలర్ల సంపదతో ఇప్పుడు ఐదో స్థానానికి చేరింది. ఐఎంఎఫ్ వెల్లడించిన తాజా జాబితాలో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
India
Economy
World
Experts

More Telugu News