ఈ చిన్నారి పాప పేరు పకోడీ.. సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న పోస్ట్​ ఇదిగో

04-09-2022 Sun 15:57
  • ఉత్తర ఐర్లాండ్ లోని ఓ రెస్టారెంట్ యజమాని వింత పోస్టు
  • తనకు చికెన్ పకోడీ అన్నా, తన మనవరాలు అన్నా ఇష్టమన్న హిలరీ బ్రానిఫ్
  • అందుకే రెండూ కలిసేలా తన మనవరాలిని పకోడీ అని పిలుచుకుంటున్నట్టు వెల్లడి
UK restaurant owner named baby pakora
ఎవరైనా దేవుళ్ల పేర్లు పెడుతుంటారు. కొందరు స్థలాల పేర్లు, మరికొందరు పురాణ గాధల్లోని పేర్లు పెడుతుంటారు. ఇటీవలి కాలంలో నోరు తిరగని చిత్రమైన పేర్లు పెడుతుండటం కూడా కనిపిస్తోంది. కానీ బజ్జీలు, మిర్చీలు వంటి పేర్లు అయితే ఎవరూ పెట్టుకోరు కదా.. అదేం లేదు. మా చిన్నారికి పకోడీ అని పేరు పెట్టామని బ్రిటన్ కు చెందిన హిలరీ బ్రానిఫ్ చెబుతోంది. ఇక్కడి ఉత్తర ఐర్లాండ్ లో ‘ది క్యాప్టెన్స్ టేబుల్’ పేరిట రెస్టారెంట్ నడిపే హిలరీ బ్రానిఫ్ తాజాగా ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. తన మనవరాలి ఫొటోను పెట్టి.. ఆమెకు పకోడీ అని పేరు పెట్టినట్టు పేర్కొన్నారు.

ఓ బిల్లునూ తయారు చేసి..
పాపకు పకోడీ అని పేరు పెట్టడమే కాదు.. ఆ పాపను ఏదో రెస్టారెంట్ లో ఆర్డర్ చేస్తే ఇచ్చినట్టుగా ఓ బిల్లునూ రూపొందించారు. మరికొన్ని వస్తువులతోపాటు పకోడీ పేరునూ అందులో చేర్చారు. ‘‘క్యాప్టెన్స్ టేబుల్ రెస్టారెంట్ లో మాకు పకోడీ అంటే ఇష్టం. నా భార్య మా పాపకు పకోడీ అని పేరు పెట్టింది. మీకు ఈ విషయం తెలియజేయాలనుకుంటున్నాను..” అని ఆ బిల్లుపై ఉండటం గమనార్హం. తమ హోటల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అవగాహన కల్పించడం, ఈ పరిశ్రమకు కాస్త ప్రోత్సాహం ఇవ్వడం కోసమే ఇలా పోస్టు పెట్టినట్టు హిలరీ బ్రానిఫ్  పేర్కొన్నారు.

పాప పేరుపై సరదా కామెంట్లు
  • పాపకు పకోడీ అని పేరు పెట్టినట్టుగా ఉన్న పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు పాప పుట్టినందుకు అభినందనలు చెబుతుంటే.. ఆమెకు పెట్టిన పేరుపై చాలా మంది సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
  • ‘వీళ్లు నా పిల్లలు ఒకరు ఎగ్ రోల్, మరొకరు వాటర్ మెలన్’, ‘ఈ ఇద్దరూ చికెన్, టిక్కా మా పిల్లలు’ అంటూ కొందరు కామెంట్ పెట్టారు.
  • ‘నేను నా పిల్లలకు కబాబ్, చిప్స్, గార్లిక్ సాస్ అని పేరు పెట్టాల్సింది’ అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.
  • ఇక ‘వీరంతా ఎందుకు ఇంతగా ఆశ్చర్యపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. ‘నా పేరు మంచీ బాక్స్.. మా ఫ్యామిలీ ఏమో ఫీస్ట్ బకెట్.. ఏం బాగోలేవా?’ అంటూ మరో నెటిజన్ పేర్కొనడం గమనార్హం.
  • మొత్తంగా ఈ కామెంట్లు, ట్రోలింగ్ చూసిన హిలరీ బ్రానిఫ్.. తనకు తన మనవరాలు అంటే ఎంతో ప్రేమ అని, చికెన్ పకోడీ అంటే బాగా ఇష్టమని.. అందుకే సరదాగా రెండూ కలిసేలా పోస్ట్ చేశానని చెప్పారు.