Sri Lanka: ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్.. ఆఫ్ఘనిస్థాన్‌పై శ్రీలంక విజయం

  • 176 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన శ్రీలంక
  • షార్జాలో లంకకు ఇదే అత్యుత్తమ ఛేజింగ్
  • ఆఫ్ఘన్ బ్యాటర్ రహమతుల్లా 84 పరుగులు వృథా
Kusal Mendis and Bhanuka Rajapaksa Help Sri Lanka Seal Tense Win

ఆసియా కప్‌లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో  శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కుశాల్ మెండిస్‌కు తోడు లోయర్ ఆర్డర్‌లో భానుక రాజపక్స రాణించడంతో ఆఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన 176 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు పాథుమ్ నిశ్శంక (35), కుశాల్ మెండిస్(36) తొలి వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆప్ఘాన్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి శ్రీలంకను దెబ్బతీసే ప్రయత్నం చేసినప్పటికీ లోయర్ ఆర్డర్‌లో రాజపక్స 14 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 31 పరుగులు, వనిందు హసరంగ 9 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసి జట్టును విజయ పథంలో  నడిపారు. షార్జాలో శ్రీలంకకు ఇదే అత్యుత్తమ ఛేజింగ్. 

అంతకుముందు రహమతుల్లా గుర్బాజ్ 45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులు చేసి స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. శ్రీలంక బౌలర్లు అడపాదడపా వికెట్లు తీసినప్పటికీ ఆఫ్ఘాన్ బ్యాటర్ల జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయారు. ఇబ్రహీం జర్దాన్ (40)తో కలిసి రెండో వికెట్‌కు గుర్బాజ్ ఏకంగా 93 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. లీగ్ దశలో శ్రీలంక, బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి సూపర్ 4లోకి ప్రవేశించిన ఆఫ్ఘనిస్థాన్ చివరి ఐదు ఓవర్లలో 37 పరుగులు మాత్రమే సాధించగలిగింది. తొలుత లెఫ్టార్మర్ దిల్షాన్ మదుశంక వెంటవెంటనే రెండు వికెట్లు పడగొట్టగా, పేసర్ అసిత ఫెర్నాండో, స్పిన్నర్ మహీశ్ తీక్షణ చెరో వికెట్ తీసుకున్నారు. 

లక్ష్య ఛేదనలో శ్రీలంక ఓపెనర్లు నిశ్శంక, మెండిస్ పవర్ ప్లేలో బాగానే పరుగులు పిండుకున్నారు. తొలుత నిశ్శంక బౌండరీలు బాదగా, ఆ తర్వాత మెండిస్ కూడా బ్యాట్ ఝళిపించాడు. స్మాషింగ్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగులో రెండు సిక్సర్లు బాది జట్టు స్కోరును అర్ధ సెంచరీ దాటించాడు. ఆఫ్ఘన్ పేసర్ నవీన్ ఉల్ హక్ వీరి భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ తర్వాత జట్టు బాధ్యతలను నిశ్శంక తలకెత్తుకున్నప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో కుదురుకోలేకపోయాడు. స్పిన్నర్ ముజీబుర్ రహ్మాన్‌కు దొరికిపోయాడు. దనుషక గుణతిలక క్రీజులో కుదురుకుని 33, భానుక రాజపక్స 31 పరుగులు చేయగా, కొత్త కుర్రాడు హసరంగ మూడు ఫోర్లు కొట్టి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 84 పరుగులు చేసిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్ రహ్మతుల్లా గుర్బాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆసియా కప్ సూపర్ 4లో నేడు భారత్-పాకిస్థాన్ జట్లు పోటీపడతాయి.

More Telugu News