Seven best sources of vitamin b12: శరీరంలో సత్తువను పెంచే విటమిన్‌ బీ12.. ఈ ఏడు ఆహార పదార్థాల్లో పుష్కలం!

  • మాంసాహారులకు సులువుగా విటమిన్ బీ12 అందే అవకాశం
  • శాకాహారులు మాత్రం ఆహారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిపుణుల సూచన
  • పాలు, పాల పదార్థాల్లోనూ గణనీయంగా బీ12 ఉంటుందని వెల్లడి
Seven best sources of vitamin b12

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నోరకాల పోషకాలు అవసరం. విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, పలు రకాల సూక్ష్మ పోషకాలు ఎన్నో శరీర క్రియల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి వాటిలో విటమిన్ బీ12 కీలకమైనది. ఆహారం నుంచి శక్తి తగిన విధంగా విడుదల కావాలన్నా, ఎర్ర రక్త కణాలు సరిగా ఉత్పత్తి కావాలన్నా ఇది అత్యవసరం. 

నిజానికి చాలా రకాల ఆహార పదార్థాల్లో విటమిన్ బీ12 లభిస్తున్నా.. దీని మోతాదు ఎక్కువగా అవసరం పడటం వల్ల మరింతగా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా శరీరానికి సత్తువను ఇచ్చి, నీరసాన్ని తొలగించడంలో.. కణాల స్థాయిలో నాడులను పరిరక్షించడంలో విటమిన్ బీ12 పాత్ర ఎనలేనిదని వైద్య, పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా స్త్రీలు, పురుషులు అందరికీ కూడా రోజుకు 2.4 మైక్రోగ్రాముల విటమిన్ బీ12 అవసరమని వివరిస్తున్నారు. అదే గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మరింత ఎక్కువగా అవసరమని చెబుతున్నారు. విటమిన్ బీ12 ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో మాంసాహారులు, శాకాహారులు తమకు అనుగుణమైన వాటిని తీసుకోవచ్చని పేర్కొంటున్నారు.

1. గొర్రె, మేక మాంసం
విటమిన్ బీ12 అత్యధికంగా ఉండే ఆహారంలో మటన్ పైస్థాయిలో ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రతి 200 గ్రాముల మటన్ లో సుమారు 11 మైక్రోగ్రాముల మేర బీ12 ఉంటుందని.. దీనికితోడు ఇతర విటమిన్లు, ప్రొటీన్లు కూడా అందుతాయని.. అవి శరీరంలో కండరాలు, ఎముకల బలోపేతానికి తోడ్పడతాయని వివరిస్తున్నారు. ఐరన్, జింక్, సెలీనియం వంటి అత్యవసర మూలకాలు కూడా అందుతాయని స్పష్టం చేస్తున్నారు. ఎర్రరక్త కణాలు తగిన స్థాయిలో ఉండేందుకు, గాయాలు త్వరగా మానేందుకు, రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండేందుకు ఇవన్నీ అవసరమని చెబుతున్నారు. మొత్తంగా శరీరంలో శక్తిని పెంచేందుకు మటన్ తోడ్పడుతుందని వివరిస్తున్నారు.

2. న్యూట్రిషనల్ ఈస్ట్ 
మనం పలు రకాల వంటల్లో ఈస్ట్ ను ఉపయోగిస్తుంటాం. అందులో న్యూట్రిషనల్ ఈస్ట్ అని లభిస్తుంది. చాలా వరకు వీటిలో విటమిన్ బీ12ను కలిపి అందిస్తుంటారు. సాధారణంగా మాంసాహారులకు విటమిన్ బీ12 సులువుగానే లభిస్తుంది. శాకాహారుల్లో చాలా వరకు బీ12 లోపంతో బాధపడుతుంటారు. అలాంటి వారికి న్యూట్రిషనల్ ఈస్ట్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి ఐదు గ్రాముల న్యూట్రిషనల్ ఈస్ట్ లో దాదాపు 2.2 మైక్రోగ్రాముల బీ12 లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఈస్ట్ ను సూప్ లలో, పాస్తాపై చల్లుకుని, సలాడ్లలో వేసుకుని తినవచ్చని సూచిస్తున్నారు.

3. పాలు, పాల పదార్థాలు
 పాలతోపాటు వెన్న, పెరుగు, పనీర్ వంటి వాటిలోనూ విటమిన్ బీ12 గణనీయంగా లభిస్తుంది. ఫ్యాట్ తీయని (టోన్ చేయని) ఒక కప్పు పాలలో 1.1 మైక్రోగ్రాముల బీ12 లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పాలు, పాల పదార్థాల్లో విటమిన్ బీ12తోపాటు కాల్షియం, ఇతర అత్యవసర పోషకాలూ ఉంటాయని వివరిస్తున్నారు. కాల్షియం వల్ల శరీరంలో ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయని.. కండరాల పనితీరు మెరుగుపడుతుందని చెబుతున్నారు. దీనివల్ల ఓ వైపు శరీరానికి ఆవశ్యక పోషకాలు అందుతూనే.. సత్తువ పెరుగుతుందని పేర్కొంటున్నారు.

4. గుడ్లు
 దాదాపు అన్ని రకాల పోషకాలకు కోడి గుడ్లు నిలయం. ప్రొటీన్లతోపాటు విటమిన్ బీ12 కూడా దీనిలో గణనీయ స్థాయిలో లభిస్తుంది. ఒక గుడ్డులో దాదాపుగా 1.4 మైక్రోగ్రామలు బీ12 ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన రోజూ రెండు గుడ్లను పొద్దున అల్పాహారంలో తీసుకుంటే.. బీ12 సహా శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలూ అందుతాయని వివరిస్తున్నారు. గుడ్లలో ఉండే విటమిన్-డితో ఎముకలు, దంతాలు, కండరాలు బలంగా ఉంటాయని.. సెలీనియం, క్లోరిన్ వంటి సూక్ష్మపోషకాలు శరీరంలో జీవక్రియలు బాగుండటానికి, కాలేయం పనితీరు మెరుగవడానికి తోడ్పడుతాయని చెబుతున్నారు. ఇవన్నీ శరీరంలో శక్తిని పెంచుతాయని స్పష్టం చేస్తున్నారు.

5. సాల్మన్ ఫిష్
విటమిన్ బీ12 అత్యధికంగా లభించే ఆహార పదార్థాల్లో సాల్మన్ ఫిష్ ముందు వరుసలో ఉంటుందని.. దీనిలో ప్రతి 100 గ్రాముల ఫిష్ లో ఏకంగా 4.15 మైక్రోగ్రాముల బీ12 ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చేపలతోపాటు మరికొన్ని సముద్ర ఉత్పత్తుల్లోనూ బీ12 గణనీయంగా ఉంటుందని వివరిస్తున్నారు. దీనిలో ఉండే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు, గుండె పనితీరును మెరుగుపరుస్తాయని.. దీనిలో ప్రొటీన్లు కూడా గణనీయంగా ఉంటాయని చెబుతున్నారు.

6. ఫోర్టిఫైడ్ ఫుడ్ (పోషకాలు కలిపిన ఆహార పదార్థాలు)
 కంపెనీలు తృణ ధాన్యాలు, కొన్ని రకాల ఆహార పదార్థాల్లో పోషకాలను కలిపి విక్రయిస్తుంటాయని.. వాటిని తీసుకోవడం వల్ల తగిన స్థాయిలో బీ12 శరీరానికి అందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా పోషకాలు కలిపిన ఆహారంలో బీ12తోపాటు ఐరన్, విటమిన్ డి, విటమిన్ సీ వంటివీ ఉంటాయని.. ఇవన్నీ కలిపి శరీరానికి సత్తువ ఇస్తాయని వివరిస్తున్నారు.

7. ఆర్గాన్ మీట్ (అవయవాల మాంసం)
 చాలా మంది మాంసాహారం తీసుకున్నా కూడా.. ఆర్గాన్ మీట్ జోలికి వెళ్లరు. నిజానికి కాలేయం, కిడ్నీలు వంటి ఆర్గాన్ మీట్ అత్యధిక స్థాయిలో బీ12కు నిలయమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 100 గ్రాముల మేక కాలేయంలో ఏకంగా 85.7 మైక్రోగ్రాముల బీ12 ఉంటుందని.. ఇది మన శరీరానికి ఏకంగా నెల రోజులకు సరిపోతుందని వివరిస్తున్నారు. ఆర్గాన్ మీట్ లో ఉండే ఐరన్, ఇతర పోషకాలు కూడా శరీరంలో నిస్సత్తువను, నీరసాన్ని దూరం చేసి.. శక్తిని ఇస్తాయని పేర్కొంటున్నారు. ఆర్గాన్ మీట్ లో అధిక స్థాయిలో ఉండే విటమిన్ ఏ మన కంటి చూపు బాగుండటానికి తోడ్పడుతుందని స్పష్టం చేస్తున్నారు.

మనకు అవసరమేంటో చూడాలి
విటమిన్ బీ12 మన శరీరంలో సత్తువను పెంచడానికి తోడ్పడినా.. పలు అంశాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, పలు ఇతర రకాల అనారోగ్యాలు ఉన్నవారు.. ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న దానిపై వైద్యుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

More Telugu News