Andhra Pradesh: ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియోపై ఎలాంటి ఫిర్యాదు అంద‌లేదు: ఏపీ డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డి

  • తిరుప‌తిలో పోలీసుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించిన డీజీపీ
  • కుప్పంలో జ‌రిగిన ఘ‌ట‌న‌లు పెద్ద‌వేవీ కాద‌ని వ్యాఖ్య‌
  • గోరంట్ల మాధ‌వ్ వీడియోపై సీఐడీ విచార‌ణ జ‌రుపుతోంద‌ని వెల్ల‌డి
ap dgp responds on ysp mp gorantla madhav video issue

ఓ మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడారంటూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లకు సంబంధించి ఏపీ డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డి శుక్ర‌వారం స్పందించారు. శుక్ర‌వారం తిరుప‌తి వెళ్లిన రాజేంద్ర‌నాథ్ రెడ్డి... తిరుపతి, చిత్తూరు జిల్లాల పోలీసు అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. 

స‌మావేశం అనంత‌రం అక్క‌డే మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా గోరంట్ల మాధ‌వ్ వీడియో వ్య‌వ‌హారంపైనా ఆయ‌న స్పందించారు. గోరంట్ల మాధ‌వ్ వీడియో వ్య‌వ‌హారంపై త‌మ‌కు ఇప్ప‌టిదాకా ఎలాంటి ఫిర్యాదు అంద‌లేద‌ని డీజీపీ చెప్పారు. అయితే ఈ వ్యవ‌హారంపై సీఐడీ అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని, జాతీయ మ‌హిళా క‌మిష‌న్ ఆదేశాల మేర‌కు క‌మిష‌న్‌కు త్వ‌ర‌లోనే నివేదిక పంపుతామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. 

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఇటీవ‌ల కుప్పంలో జ‌రిపిన ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల‌పైనా రాజేంద్ర‌నాథ్ రెడ్డి స్పందించారు. కుప్పంలో చోటుచేసుకున్న ఘ‌ట‌న‌లు మ‌రీ పెద్ద‌వేమీ కాద‌ని ఆయ‌న అన్నారు. శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పేలా కుప్పంలో ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌లేద‌న్నారు. అయినా ప్ర‌తి చిన్న విష‌యానికి పోలీసుల‌పై నింద‌లేయ‌డం స‌రికాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

More Telugu News