'బ్రహ్మాస్త్రం' ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

02-09-2022 Fri 18:18 | Both States
  • రణబీర్ కపూర్, అలియా జంటగా బ్రహ్మాస్త్ర
  • తెలుగులో బ్రహ్మాస్త్రం పేరిట రిలీజ్
  • సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకి!
  • ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సన్నాహాలు
  • చివరి నిమిషంలో ప్రోగ్రామ్ క్యాన్సిల్ అంటూ ప్రకటన
Brahmastram pre release event has been canceled
రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. ఈ చిత్రాన్ని తెలుగులో 'బ్రహ్మాస్త్రం' పేరిట సెప్టెంబరు 9న విడుదల చేస్తున్నారు. కాగా, నేడు 'బ్రహ్మాస్త్రం' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాల్సి ఉండగా, చివరి నిమిషంలో రద్దయింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నట్టు చిత్రబృందం ఇప్పటికే భారీగా ప్రచారం చేసింది. 

అయితే, అనుకోని కారణాల వల్ల ప్రీ రిలీజ్ వేడుకను క్యాన్సిల్ చేస్తున్నామని చిత్రయూనిట్ తాజాగా ప్రకటన చేసింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'బ్రహ్మాస్త్రం' చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా కీలక పాత్రలు పోషించారు. తెలుగులో ఈ చిత్రాన్ని రాజమౌళి సమర్పిస్తున్నారు. 

నాగార్జున నటించడం, రాజమౌళి సమర్పణ, ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను రామోజీ ఫిలింసిటీలో నిర్వహించాలని భావించగా, అనుమతులు లభించకపోవడంతోనే రద్దు చేసినట్టు కథనాలు వస్తున్నాయి.