Madhya Pradesh: కాళ్లకు బదులు కొమ్ములాంటి ఆకారంతో జన్మించిన శిశువు.. విచిత్ర వైకల్యమంటున్న వైద్యులు

  • మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాలో ఘటన
  • శిశువు కేజిన్నర మాత్రమే ఉండడంతో ఎస్ఎన్‌సీయూకి తరలింపు
  • గర్భస్థ పిండం ఎదగకపోవడం, పోషకాహార లోపం కారణమై ఉంటుందన్న వైద్యులు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
Baby born with horn like structure instead of legs in Madhya Pradesh

నెట్‌ఫ్లిక్స్‌లో ‘స్వీట్ టూత్’ అనే వెబ్ సిరీస్ చూసిన వారు అందులోని పిల్లాడిని మర్చిపోవడం కష్టం. ఆ కుర్రాడి తలపై జంతువుల్లా కొమ్ములు ఉంటాయి. హాలీవుడ్ సినిమాల్లోనూ ఇలాంటి ఊహాజనిత పాత్రలు కనిపిస్తూ ఉంటాయి. మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాలో ఓ మహిళ జన్మనిచ్చిన బాలుడికి కాళ్లకు బదులుగా కొమ్ములాంటి ఆకారం ఉండడం ‘స్వీట్ టూత్’ వెబ్ సిరీస్‌ను గుర్తు చేస్తోంది.  

జిల్లాలోని మణిపుర పీహెచ్‌సీలో గత నెల 26న ఓ మహిళ కాళ్లులేని శిశువుకు జన్మనిచ్చింది. చేతులు, మిగతా అవయవాలు అన్నీ బాగానే ఉన్నా కాళ్లు ఉండాల్సిన స్థానంలో కొమ్ము ఆకారంలో అవయవం ఉంది. ఈ ‘మిరాకిల్ బేబీ’ని చూసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆ శిశువు బరువు కేజిన్నర మాత్రమే ఉండడంతో వెంటనే శివ్‌పురి జిల్లా ఆసుపత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ (ఎస్ఎన్‌సీయూ)లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. విచిత్ర వైకల్యంతో బాబు జన్మించినట్టు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు చెప్పారు.

మరోవైపు, విచిత్ర వైకల్యంతో శిశువు జన్మించిందన్న వార్త సోషల్ మీడియాకెక్కి వైరల్ కావడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది. తల్లి గర్భంలో పిండం పూర్తిగా ఎదగకపోవడం వల్ల, పోషకాహారం సరిగా అందకపోవడం వల్ల ఇలా జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలను చూసి పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు ‘అయ్యో’ అంటుంటే, మరికొందరు మాత్రం దేవుడి లీలగా అభివర్ణిస్తున్నారు. 

కాగా, ఇలా విచిత్ర వైకల్యంతో శిశువు జన్మించిన ఘటనలు గతంలోనూ పలుమార్లు వెలుగు చూశాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో నాలుగు చేతులు, కాళ్లున్న శిశువు జన్మించింది. ఇలా పుట్టిన శిశువు బతకడం చాలా అరుదని వైద్యులు చెబుతున్నారు.

More Telugu News