AP High Court: పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో సీట్లు ఇస్తారా?.. మీరు జైలుకు వెళ్తారా?: ఏపీ సీఎస్‌పై హైకోర్టు ఆగ్రహం

AP High Court Warns AP CS On Private School not applying RTE Act
  • విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద పిల్లలకు కేటాయించాలని ఆదేశం
  • న్యాయస్థానం తీర్పును అమలు చేయడం లేదంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యం
  • సీఎస్, పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం
విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించకపోవడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను అమలు చేయకుండా ప్రైవేటు పాఠశాలలకు పరోక్షంగా సాయపడుతుండడమే కాకుండా పేదవిద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడింది. 

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఇచ్చినట్టు చూపించకుంటే జైలుకు పంపాల్సి వస్తుందని సీఎస్, పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లను హెచ్చరించింది. అంతేకాదు, ‘‘విద్యార్థులు స్కూల్లో అయినా ఉండాలి.. లేదంటే మీరు జైల్లో అయినా ఉండాలి’’ అని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

ఎంతమంది పేద పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించారో వివరాలు కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. ఆ వివరాలతో తాము సంతృప్తి చెందకుంటే వ్యక్తిగత హాజరుకు ఆదేశిస్తామని పేర్కొంది. ఆర్టీఈ చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో మొదటి తరగతిలో 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలంటూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయడం లేదంటూ న్యాయవాది తాండవ యోగేశ్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. తాజాగా ఈ కేసు మరోమారు విచారణకు రాగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

రాష్ట్రంలో 16 వేల ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయని, ఒక్కో పాఠశాలలో కనీసం ఐదుగురు పేద పిల్లలకు ఉచితంగా సీట్లు కేటాయించినా మొత్తం 80 వేల మంది చిన్నారులకు ఉచితంగా చదువుకునే అవకాశం లభించి ఉండేదని యోగేశ్ వాదించారు. స్పందించిన ప్రభుత్వ న్యాయవాది నాగరాజు తన వాదనలు వినిపిస్తూ.. సీట్ల భర్తీ ప్రక్రియను సిద్ధం చేశామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. వివరాలను సమర్పించేందుకు గడువు ఇవ్వాలని కోరారు.
AP High Court
Private Schools
RTE
Poor Children

More Telugu News