Tejas 2.0: తేజాస్ 2.0 మెగా ప్రాజెక్టుకు క్యాబినెట్ కమిటీ ఆమోదం

  • దేశీయంగా అభివృద్ధి చేసిన తేజాస్
  • తేలికపాటి యుద్ధ విమానంగా గుర్తింపు
  • తేజాస్ పై పలు దేశాల ఆసక్తి
  • కొత్త వెర్షన్ తయారీకి కేంద్రం సన్నద్ధం
  • రూ.6,500 కోట్లతో భారీ ప్రాజెక్టు
PM Modi led cabinet committee approves Tejas advanced version

ఆయుధ తయారీ రంగంలో స్వావలంబన కోసం ఏళ్ల తరబడి భారత్ చేసిన కృషి ఫలితం తేజాస్ తేలికపాటి పోరాట విమానం రూపంలో సాకారమైంది. తేజాస్ యుద్ధ విమానం సమర్థత పరంగా పలు విదేశీ యుద్ధ విమానాలకు దీటుగా నిలుస్తుండడంతో, అనేక దేశాలు ఈ విమానంపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పుడు తేజాస్ 2.0పై భారత్ దృష్టి సారించింది. తేజాస్ ను మరింత అభివృద్ధి పరిచే మెగా ప్రాజెక్టుకు తాజాగా కేంద్ర క్యాబినెట్ కమిటీ (భద్రతాపరమైన అంశాలు) ఆమోదం లభించింది. 

ఇప్పటికే ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాన్ని తయారుచేయాలన్న బృహత్ సంకల్పంతో ఉన్న భారత్... తేజాస్ 2.0ను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలోని క్యాబినెట్ కమిటీ పచ్చజెండా ఊపింది. ఈ భారీ ప్రాజెక్టు వ్యయం రూ.6,500 కోట్లు కాగా, ఇప్పటికే రూ.2,500 కోట్లు కేటాయించినట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతం ఉన్న తేజాస్ మార్క్-1 పోరాట విమానంలో జీఈ-404 ఇంజిన్లను వినియోగిస్తున్నారు. కొత్తగా అభివృద్ధి పరిచే తేజాస్ మార్క్-2 విమానంలో మరింత శక్తిమంతమైన జీఈ-414 ఇంజిన్లను అమర్చుతారు. ఈ ఇంజిన్లు 98 కిలోన్యూటన్ల శక్తి విభాగానికి చెందినవి. ఆధునికీకరించిన అనంతరం తేజాస్ పోరాట సామర్థ్యం మరింత ఇనుమడిస్తుంది. పోరాట పరిధి పెరగడమే కాదు, అత్యధిక సంఖ్యలో భారీ అస్త్రాలను మోసుకెళ్లే సత్తా ఈ విమానం సొంతంమవుతుంది. 

కాగా, స్టెల్త్ పరిజ్ఞానంతో కూడిన , రూ.15,000 కోట్ల అంచనా వ్యయం కలిగిన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టు కూడా మరికొన్ని నెలల్లో కార్యరూపం దాల్చేందుకు క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.

More Telugu News