Portugal: గర్భిణి అయిన భారతీయ పర్యాటకురాలి మృతి.. రాజీనామా చేసిన పోర్చుగల్ ఆరోగ్యశాఖ మంత్రి

  • భారతీయ పర్యాటకురాలి మృతికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా
  • ప్రసూతి విభాగం నిండిపోవడంతో అంబులెన్స్‌లో ఆసుపత్రుల చుట్టూ తిప్పిన వైనం
  • అంబులెన్స్‌లోనే గుండెపోటుకు గురై మరణించిన భారతీయ పర్యాటకురాలు
  • విమర్శలకు తలొగ్గిన మంత్రి మార్టా
Portugal health minister steps down after pregnant Indian tourist dies

గర్భిణి అయిన భారతీయ పర్యాటకురాలి మృతికి నైతిక బాధ్యత వహిస్తూ పోర్చుగల్ ఆరోగ్యశాఖ మంత్రి మార్టా టెమిడో తన పదవికి రాజీనామా చేశారు. లిస్బన్‌లోని ప్రధాన ఆసుపత్రి అయిన శాంటియా మారియా ఆసుపత్రిలోని నియోనాటాలాజీ విభాగం కిక్కిరిసిపోవడంతో 34 ఏళ్ల భారతీయ గర్భిణిని అక్కడి నుంచి అంబులెన్స్‌లో ఆసుపత్రుల చుట్టూ తిప్పుతుండగా గుండెపోటుతో మరణించారు. అయితే, అత్యవసరంగా సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. పర్యాటకురాలి మృతిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా, ఆమె మరణించిన కాసేపటికే ఆరోగ్య మంత్రి మార్టా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 

కరోనా సమయంలో దేశవ్యాప్తంగా టీకా వేయించడంలో మార్టా విజయం సాధించి మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర ప్రసూతి సేవలను నిలిపివేయాలన్న ఆమె నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కాగా, మార్టా రాజీనామాను ఆమోదించినట్టు ప్రధానమంత్రి అంటోనియో కోస్టా తెలిపారు. ఆమె అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. మౌలిక సదుపాయాల ఏర్పాటు ద్వారా ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేశారని కొనియాడారు.    

ఆసుపత్రుల్లోని ప్రసూతి యూనిట్లు నిండిపోతుండడంతో గర్భిణులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ కారణంగానే భారతీయ పర్యాటకురాలిని ఆసుపత్రుల చుట్టూ తిప్పుతుండగా గుండెపోటుతో ఆమె మరణించారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఆరోగ్య మంత్రి మార్టాపై దుమ్మెత్తి పోశాయి. ఈ నేపథ్యంలో పర్యాటకురాలి మరణానికి నైతిక బాధ్యత వహిస్తూ మార్టా రాజీనామా చేశారు.

More Telugu News