Asia Cup: చెల‌రేగిన కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్‌... హాంకాంగ్ టార్గెట్ 193 ప‌రుగులు

  • 2 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసిన భార‌త్‌
  • 26 బంతుల్లోనే 68 ప‌రుగులతో చెల‌రేగిన సూర్య‌కుమార్‌
  • ఆసియా క‌ప్‌లో తొలి హాఫ్ సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా కోహ్లీ
team india scores 192 runs in 20 overs against hongkong

ఆసియా క‌ప్‌లో భాగంగా బుధ‌వారం జ‌రుగుతున్న మ్యాచ్‌లో భార‌త స్టార్ బ్యాట‌ర్లు అద‌ర‌గొట్టారు. ఫామ్ లేమితో స‌త‌మ‌త‌మ‌వుతున్న విరాట్ కోహ్లీ(59) ఈ మ్యాచ్‌లో జూలు విదిల్చాడు. ప్ర‌స్తుత ఆసియా క‌ప్‌లో తొలి హాఫ్ సెంచ‌రీ చేసిన క్రికెట‌ర్‌గా గుర్తింపు సంపాదించాడు. ఇక కోహ్లీకి జ‌త క‌లిసిన మ‌రో బ్యాటర్ సూర్య‌కుమార్ యాద‌వ్ (68) ఆకాశమే హద్దుగా చెల‌రేగిపోయాడు. కేవ‌లం 26 బంతుల‌ను ఎదుర్కొన్న యాద‌వ్‌.. ఆరేసి ఫోర్లు, సిక్స‌ర్ల‌తో 68 ప‌రుగులు పిండేశాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది.

భార‌త ఇన్నింగ్స్‌ను స్టార్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్‌(36)తో క‌లిసి ప్రారంభించిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (21) ఆదిలో ధాటిగానే ఆడాడు. అదే క్ర‌మంలో టీమిండియాకు మంచి ప్రారంభాన్ని అందించిన అత‌డు స్వ‌ల్ప స్కోరుకే వెనుదిరిగాడు. రోహిత్ అవుట్ కావ‌డంతో క్రీజులోకి వ‌చ్చిన కోహ్లీ త‌న బ్యాట్ ప‌వ‌ర్ చూపుతూ 44 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌ల‌తో చెల‌రేగాడు. కోహ్లీ చెల‌రేగుతుండ‌గా... అవత‌లి ఎండ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ ధాటిగానే ఆడుతూ క‌నిపించాడు. అయితే అతడు కూడా అవుట్ కావ‌డంతో కోహ్లీకి సూర్య‌కుమార్ యాద‌వ్ జ‌త క‌లిసి భార‌త ఇన్నింగ్స్‌ను ప‌రుగులు పెట్టించాడు. 

హాంకాంగ్ బౌలర్లు పెద్ద‌గా రాణించ‌లేద‌నే చెప్పాలి. ప‌రుగులు నిలువ‌రించే విష‌యంలో హాంకాంగ్ బౌల‌ర్ల‌తో పాటు ఫీల్డ‌ర్లు కూడా విఫ‌ల‌మ‌య్యార‌నే చెప్పాలి. హాంకాంగ్ బౌలింగ్‌ను ప్రారంభించిన హ‌రూన్ అర్ష‌ద్ కేవలం 3 ఓవ‌ర్లు వేసి ఏకంగా 53 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ఆ త‌ర్వాత బౌలింగ్‌కు దిగిన ఆయుశ్ శుక్లా 4 ఓవ‌ర్లు వేసి కాస్తంత పొదుపుగానే బౌలింగ్ చేసి ఓ వికెట్ తీశాడు. చివ‌ర‌లో బౌలింగ్‌కు దిగిన మ‌హ్మ‌ద్ ఘ‌జ్జ‌న్‌ఫ‌ర్ 2 ఓవ‌ర్లు వేసి ఓ వికెట్ తీశాడు. మ‌రికాసేప‌ట్లోనే బ్యాటింగ్‌కు దిగ‌నున్న హాంకాంగ్ 193 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో ఛేజింగ్ మొద‌లుపెట్ట‌నుంది.

More Telugu News