Maheesh Theekshana: నేటి మ్యాచ్‌లో కోహ్లీ 71వ సెంచరీ నమోదు చేస్తాడు: శ్రీలంక స్పిన్నర్ జోస్యం

Maheesh Theekshana predicts Virat Kohli will hit a ton in Indias match against Hong Kong
  • కోహ్లీ తన కెరియర్‌లో నేడు 71వ సెంచరీ నమోదు చేస్తాడన్న శ్రీలంక స్పిన్నర్
  • భారత్-శ్రీలంక జట్లు ఫైనల్‌లో తలపడాలని కోరుకుంటున్నానన్న మహీష్ తీక్షణ
  • కోహ్లీ వికెట్ తీయాలని ఉందన్న స్పిన్నర్
ఆసియాకప్‌లో భాగంగా మరికాసేపట్లో భారత్-హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ సెంచరీ నమోదు చేస్తాడని శ్రీలంక స్పిన్నర్ మహీష్ తీక్షణ జోస్యం చెప్పాడు. ‘న్యూస్ 21 స్పోర్ట్స్’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తీక్షణ మాట్లాడుతూ.. ఈ టోర్నీలో భారత్-శ్రీలంక జట్లు ఫైనల్ పోరులో తలపడాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. అలాగే, కోహ్లీ వికెట్ తీయాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు. 

ఆసియా కప్ ఫైనల్‌లో భారత్-శ్రీలంక జట్లు తలపడాలని, విరాట్ కోహ్లీని అవుట్ చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పిన మహీష్ తీక్షణ.. కోహ్లీ అద్భుతమైన ఆటగాడని ప్రశంసించాడు. నేడు హాంకాంగ్‌తో జరగనున్న మ్యాచ్‌లో కోహ్లీ తన కెరియర్‌లో 71వ సెంచరీ నమోదు చేస్తాడని భావిస్తున్నట్టు చెప్పాడు. కాగా, పేలవ ఫామ్‌తో నానా తంటాలు పడుతున్న కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ రాక 1000 రోజులు దాటిపోయింది. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చినట్టే కనిపించినా భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యాడు. కోహ్లీ తన చివరి సెంచరీని 23 నవంబరు 2019లో కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సాధించాడు. ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు శతకం ముఖమే చూడలేదు. 

కాగా, ఆసియా కప్‌‌లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తీక్షణ దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఓవర్లు వేసి 35 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.
Maheesh Theekshana
Virat Kohli
Asia Cup 2022
Hong Kong

More Telugu News