Nutty: తనను గుడ్డిగా నమ్మిన ఫాలోవర్లకు రూ.437 కోట్లకు టోకరా వేసిన యూట్యూబ్ స్టార్ 

  • ఆర్థికనేరానికి పాల్పడిన థాయ్ యూట్యూబ్ స్టార్ నట్టీ
  • డ్యాన్స్ వీడియోలతో పాప్యులారిటీ
  • ఫారెక్స్ ట్రేడింగ్ వీడియోలతో ఫాలోవర్లకు వల
  • 35 శాతం లాభాలు అంటూ ప్రచారం
  • నట్టీకి డబ్బు చెల్లించిన 6 వేల మంది
Youtube star Nutty cheated her followers

ఆమె పేరు నథామోన్ ఖోంగ్చాక్. థాయ్ లాండ్ కు చెందిన ఈ అమ్మడు పేరుమోసిన యూట్యూబ్ స్టార్. నట్టీగా అందరికీ సుపరిచితమైన ఈ అందాలభామకు యూట్యూబ్ లో 8.47 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. నట్టీ తన డ్యాన్స్ వీడియోలతో అందరినీ అలరిస్తుంటుంది. అంతేకాదు, విదేశీ మారకద్రవ్యం నేపథ్యంలో అధిక లాభాలు ఆర్జించడం ఎలాగో ఆశావహులకు ప్రైవేటుగా అవగాహన కల్పిస్తుంటుంది. ఈ మేరకు తనకు ఫారెక్స్ ట్రేడింగ్ లో వచ్చిన లాభాలు అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పలు పోస్టులు పెడుతుంటుంది. 

దాంతో ఆ యూట్యూబ్ స్టార్ మాటలు, ప్రచారం నిజమే అని నమ్మిన 6 వేల మందికి పైగా ఫాలోవర్లు ఆమెకు తమ డబ్బు ఇచ్చి పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఎంత పెట్టుబడి పెడితే అంతకు 35 శాతం అధిక లాభాలతో తిరిగి ఇస్తానంటూ నట్టీ వారిని నమ్మబలికింది. ఎంతకీ తమ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో తాము మోసపోయినట్టు ఫాలోవర్లకు అర్థమైంది. ఆ విధంగా రూ.437 కోట్లకు టోపీ వేసిందని భావిస్తున్నారు.

దీనిపై థాయ్ లాండ్ పోలీసులకు 102 ఫిర్యాదులు అందాయి. ఇప్పటికీ ప్రతి రోజూ ఎవరో ఒకరు నట్టీపై ఫిర్యాదు చేస్తూనే ఉన్నారని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ యూట్యూబ్ డ్యాన్సింగ్ స్టార్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 

కాగా, గత మేలో నట్టీ ఇన్ స్టాగ్రామ్ లో చివరి పోస్టు చేసింది. పెట్టుబడిదారులకు తాను రూ.218 కోట్లు బాకీ పడ్డానని వెల్లడించింది. మరో వీడియోలో, తన ట్రేడింగ్ అకౌంట్ ను బ్రోకర్ బ్లాక్ చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, మార్చి నుంచే నిధులు ఆగిపోయాయని వాపోయింది. తనకు డబ్బు ఇచ్చినవారికి తిరిగి చెల్లించేందుకు ప్రయత్నిస్తునానని తెలిపింది.

More Telugu News