హార్దిక్ పాండ్యా భ‌విష్య‌త్తు ఏమిటో చెప్పేసిన హర్భ‌జ‌న్ సింగ్‌

31-08-2022 Wed 15:30
  • పాక్‌తో మ్యాచ్‌లో అద‌ర‌గొట్టిన పాండ్యా
  • ఆల్ రౌండ్ షోతో ఇండియాకు చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాన్ని అందించిన వైనం
  • పాండ్యా సామ‌ర్ధ్యాన్ని విశ్లేషిస్తూ హ‌ర్భ‌జ‌న్ సింగ్ కీల‌క వ్యాఖ్య‌లు
  • ధోనీలా మారిపోతున్నాడ‌ని పాండ్యాపై ప్ర‌శంస‌లు
Harbhajan singh predicts pandya will be the next captain to the team india
టీమిండియా స్టార్ క్రికెట‌ర్‌ హార్దిక్ పాండ్యాపై ఇప్పుడు ప్ర‌శంస‌ల జల్లు కురుస్తోంది. ఆసియా క‌ప్‌లో భాగంగా దాయాదీ దేశం పాకిస్థాన్ తో జ‌రిగిన మ్యాచ్‌లో భాగంగా అటు బంతితో చెల‌రేగిన పాండ్యా... ఇటు బ్యాటునూ ఝుళిపించాడు. అంతేకాకుండా క‌ళ్లు చెదిరే సిక్స్‌తో అత‌డు పాక్‌పై భార‌త జ‌ట్టుకు చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాన్ని అందించాడు. ఈ విన్నింగ్ షాట్‌తో అత‌డు కెప్టెన్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీని మ‌రోమారు గుర్తు చేశాడు. ఈ క్ర‌మంలో గ‌డ‌చిన నాలుగు రోజులుగా అత‌డిపై అన్ని వ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ ప్ర‌శంస‌ల్లో భాగంగా టీమిండియా మాజీ ఆట‌గాడు, ఆప్ రాజ్య‌స‌భ స‌భ్యుడు హ‌ర్భ‌జ‌న్ సింగ్ బుధ‌వారం హార్దిక్ పాండ్యాను ఆకాశానికెత్తేశాడు. భార‌త క్రికెట్ జ‌ట్టుకు త‌దుప‌రి కెప్టెన్ అవుతాడంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. పాండ్యా బ్యాటింగ్ మ‌రో స్థాయిలో ఉంద‌న్న హ‌ర్భ‌జ‌న్‌.. గాయాల త‌ర్వాత పాండ్యా ఎంత‌గానో శ్ర‌మించి తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడ‌ని తెలిపాడు. జ‌ట్టుకు విజ‌యాన్ని అందించి తీర‌తాన‌న్న భ‌రోసా పాండ్యాలో క‌నిపిస్తోంద‌ని, ఈ ల‌క్ష‌ణ‌మే అత‌డిని జ‌ట్టు త‌దుప‌రి కెప్టెన్‌ను చేస్తుంద‌ని సింగ్ తేల్చేశాడు.

పాండ్యాలో మ‌నం ఇప్పుడు మ‌రో కోణాన్ని చూస్తున్నామ‌న్న హ‌ర్భ‌జ‌న్‌.. అత‌డు ఇప్పుడు ధోనీలా మారుతున్నాడ‌ని తెలిపాడు. పాండ్యా ఇప్పుడు చాలా కూల్‌గానే కాకుండా స్థిరంగా క‌నిపిస్తున్నాడ‌ని తెలిపాడు. పాండ్యా బ్యాటింగ్ కూడా ఇప్పుడు అద్భుతంగా ఉంద‌న్నాడు. మ‌న సామ‌ర్ధ్యంపై మ‌న‌కు విశ్వాసం ఉన్న‌ప్పుడు మ‌నం ఈ త‌ర‌హాలో మార‌గ‌ల‌మ‌ని కూడా అత‌డు వ్యాఖ్యానించాడు. ఈ ల‌క్ష‌ణాలు ఉన్న ఆట‌గాడు జ‌ట్టుకు కెప్టెన్ కావాల‌ని ఆకాంక్షించాడు. పాండ్యా త‌ప్ప‌కుండా కెప్టెన్ అయి తీర‌తాడ‌ని హ‌ర్భ‌జ‌న్ సింగ్ తెలిపాడు.