Chinook: చినూక్​ సైనిక హెలికాప్టర్లు.. అమెరికా వాడటం ఆపేసింది. మన వద్ద ఓకే అంటున్న రక్షణశాఖ వర్గాలు!

Indian air force chinooks operating normally say sources after US army grounds them
  • బోయింగ్ సంస్థ తయారు చేసిన డబుల్ రోటార్ హెవీ హెలికాప్టర్లు
  • ఇంజన్లలో స్వల్ప లోపం ఉందంటూ తాజాగా పక్కనపెట్టిన అమెరికా
  • మన దేశ రక్షణ శాఖలోనూ చినూక్ హెలికాప్టర్లు.. వాటిలో లోపాలు లేవంటున్న సైన్యం
హిమాలయాలు వంటి అత్యంత ఎత్తైన ప్రాంతాల్లోనూ సమర్థవంతంగా ప్రయాణించగల చినూక్ సైనిక హెలికాప్టర్ల విషయంగా గందరగోళం నెలకొంది. సైనిక దళాల రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ భారీ హెలికాప్టర్ల ఇంజన్లలో స్వల్ప లోపం ఉందంటూ అమెరికా సైన్యం తాత్కాలికంగా పక్కన పెట్టేసింది. అదే తరహా చినూక్ హెలికాప్టర్లను భారత సైన్యం కూడా వినియోగిస్తుండటంతో.. పరిస్థితి ఏమిటన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే భారత్ వినియోగిస్తున్న చినూక్ హెలికాప్టర్లు బాగానే పనిచేస్తున్నాయని, వాటిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదని రక్షణశాఖ భావిస్తున్నట్టు సమాచారం. 

మూడేళ్లుగా వినియోగిస్తున్నా.. 
  • చినూక్ సైనిక హెలికాప్టర్లను అమెరికాకు చెందిన బోయింగ్‌ సంస్థ తయారు చేస్తోంది. 1960 నుంచీ సైనిక బలగాల రవాణా, విపత్తు సహాయక చర్యలు, క్షతగాత్రుల తరలింపు వంటి కార్యక్రమాల్లో చినూక్‌ హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు.
  • వీటిని అమెరికాతోపాటు దక్షిణ కొరియా, ఇటలీ, కెనడా, భారత్‌ తదితర దేశాలు కూడా వినియోగిస్తున్నాయి. మన ఎయిర్ ఫోర్స్ లో 15 చినూక్‌లు ఉన్నాయి. 2019 నుంచే వాటిని మన దేశం వినియోగిస్తోంది.
  • ఇటీవల అమెరికాలో చినూక్‌  హెలికాప్టర్ల ఇంధన ట్యాంకులు లీకై మంటలు చెలరేగాయి. దానిపై విచారణ చేపట్టిన సైన్యం వాటి ఇంజన్లలోని ఓ రింగ్స్ గా పిలిచే భాగాలు నాసిరకంగా ఉన్నట్టు గుర్తించారు. దీనితో సుమారు 400 హెలికాప్టర్లను వినియోగించకుండా పక్కన పెడుతున్నట్టు అమెరికా సైన్యం ప్రకటించింది.
  • అయితే అన్ని హెలికాప్టర్లలో ఈ సమస్య లేదని.. హనీవెల్‌ సంస్థ నిర్మించి బోయింగ్ కు అందించిన కొన్నిరకాల ఇంజన్లలో మాత్రం ఈ సమస్య ఉన్నట్టుగా తేల్చారు. 
  • ఇండియా వినియోగిస్తున్న చినూక్ హెలికాప్టర్లలో ఇంజన్లు ఎవరు తయారు చేసినవి, వాటిలో ఈ సమస్య ఉందా, లేదా అనేది తెలియరాలేదు. కానీ సమస్యేమీ లేదని రక్షణ శాఖ వర్గాలు మాత్రం చెబుతున్నాయి.

Chinook
Chinook Helicoptors
Defence
India
USA
Airforce
National

More Telugu News