Temple Of Vedic Planetarium: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఇదే!

  • పశ్చిమ బెంగాల్ లోని మాయాపూర్ లో నిర్మాణం
  • టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానెటోరియం పేరిట నిర్మిస్తున్న ఇస్కాన్
  • ప్రధాన గోపురం ఎత్తు 113 మీటర్లు
  • రూ.795 కోట్ల వ్యయంతో నిర్మాణం
World biggest Hindu Temple being constructed in Mayapur

ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాలు అంటే నేపాల్ లోని పశుపతినాథ్ ఆలయం, కాంబోడియాలోని ఆంగ్ కోర్ వాట్ దేవాలయం, ఢిల్లీలోని అక్షర్ ధామ్... ఇలా చెప్పుకుంటూ వెళ్లొచ్చు. కానీ అంతకంటే పెద్ద దేవాలయం ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లోని మాయాపూర్ లో రూపుదిద్దుకుంటోంది. దీన్ని టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానెటోరియంగా పిలుస్తున్నారు. 

2023 నాటికి ఈ అతి భారీ ఆలయ నిర్మాణం పూర్తి కానుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం మాత్రమే కాదు, అత్యంత ఎత్తయిన హిందూ దేవాలయం కూడా. ఆ ఆలయం ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షస్ నెస్) ప్రధాన కేంద్రంగా వర్థిల్లనుంది. కోల్ కతా నగరానికి మాయాపూర్ 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

ఈ టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానెటోరియంను రూ.795 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ ఆలయ ప్రధాన గోపురం ఎత్తు 113 మీటర్లు. ఈ ఆలయంలో 10 వేల మందికి ఆశ్రయం కల్పించవచ్చు. భాగవతంలోని కీలక ఘట్టాలను ప్రతిబింబించేలా ఆలయం లోపలిభాగాలను తీర్చిదిద్దుతున్నారు. అంతేకాదు, ఈ ఆలయాన్ని వేద ఖగోళ జ్ఞానాన్ని పంచే నిర్మాణంగా రూపుదిద్దుతున్నారు. 

ఇప్పటికే మాయాపూర్ లో ఇస్కాన్ కు చంద్రోదయ పేరిట ఓ ఆలయం ఉంది. దానికి అనుబంధంగా ఈ కొత్త ఆలయాన్ని నిర్మిస్తున్నారు. టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానెటోరియం నిర్మాణం పూర్తయితే వాటికన్ సిటీలోని సెయింట్ పాల్స్ కేథెడ్రల్, ఆగ్రాలోని తాజ్ మహల్ ల కంటే పెద్దదిగా అవతరిస్తుంది.

More Telugu News