Tribal Man: బ్రెజిల్ లోని ఆదివాసీ తెగకు చెందిన ఒకే ఒక్కడు... ఇక లేడు!

  • టనారు ప్రాంతంలో అరుదైన ఆదివాసీ తెగ
  • గత 26 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తి
  • ఇటీవల విగతజీవుడిగా దర్శనం
  • అంతరించిపోయిన ఆదివాసీ తెగ
  • అధికారికంగా ప్రకటించిన బ్రెజిల్ ప్రభుత్వం
Last man of aboriginal tribe in Brazil found dead

బ్రెజిల్ లోని టనారు ఆదివాసీ తెగ అంతరించిపోయింది. ఈ తెగలోని చివరి వ్యక్తి కూడా ఇటీవలే మరణించాడు. ఆ వ్యక్తి గత 26 ఏళ్లుగా ఒక్కడే జీవిస్తున్నాడు. 70వ దశకంలో రోండోనియా రాష్ట్రంలోని టనారు ఆదివాసీ ప్రాంతానికి చెందిన వారిని భూస్వాములు పొట్టనబెట్టుకున్నారు. అటవీభూముల్లో తమ పాలాలను విస్తరించుకునేందుకు ఆ అరుదైన తెగకు చెందిన వారిని బలిగొన్నారు. 

ఆ తర్వాత 1995లో అక్రమ గనుల తవ్వకందారులు ఈ తెగకు చెందిన మరికొందరిని చంపేశారు. దాంతో ఆ తెగలో ఒకే ఒక్క వ్యక్తి మిగిలాడు. దాంతో, అతడు ఉండే ప్రాంతాన్ని బ్రెజిల్ ప్రభుత్వం ఇతరులకు నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించింది. 

కాగా, అతడు గోతులు తవ్వి  వాటిలో పడే జంతువులను ఆహారంగా తీసుకుంటాడు. అందుకే అతడిని బ్రెజిల్ లో 'మ్యాన్ ఆఫ్ హోల్' అని పిలుస్తారు. అతడి పేరేమిటో ఎవరికీ తెలియదు. కాగా, అతడు సంచరించే ప్రాంతాలను బ్రెజిల్ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తుంటారు. 

ఎప్పట్లానే రోజువారీ పరిశీలన చేపట్టిన ఓ ఉద్యోగికి ఆ ఆదివాసీ వ్యక్తి విగతజీవుడిలా దర్శనమిచ్చాడు. తనకు మరణం ఆసన్నమైందని తెలుసుకున్న ఆ వ్యక్తి శరీరంపై ఈకలు కప్పుకుని ఉండడం దర్శనమిచ్చింది. అతడి వయసు 60 ఏళ్లు ఉండొచ్చని అంచనా వేశారు. అతడి మరణాన్ని బ్రెజిల్ ప్రభుత్వం నిర్ధారించింది.

More Telugu News