పాత ఇల్లు కూలుస్తుండగా బయటపడిన బంగారు నిధి.. గుట్టుచప్పుడు కాకుండా పంచేసుకున్న కూలీలు

30-08-2022 Tue 08:35 | Offbeat
  • మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఘటన
  • ఓ బంగారు నాణేన్ని విక్రయించి సరుకులు, సెల్‌ఫోన్ కొనుక్కున్న కూలీ
  • మద్యం మత్తులో నోరు జారడంతో విషయం వెలుగులోకి
  • ఆ సొత్తు విలువ రూ. 1.25 కోట్లు ఉంటుందన్న పురావస్తు శాఖ
8 workers found a buried gold treasure in Madhya Pradesh
భవనం కట్టేందుకు పాత ఇంటిని కూలుస్తుండగా నిధి బయటపడింది. అది చూసిన కూలీలు గుట్టుచప్పుడు కాకుండా అందులోని బంగారు నాణేలు, అరుదైన ఆభరణాలను పంచేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శిథిలావస్థలో ఉన్న ఇంటిని కూల్చివేసేందుకు 8 మంది కూలీలను పురమాయించారు. వారు పనులు మొదలుపెట్టి కొంతభాగాన్ని కూల్చివేశారు. ఆ శిథిలాలను తరలిస్తున్న సమయంలో ఓ లోహపు పాత్ర కనిపించింది. దానిని తీసుకుని చూడగా అందులో 84 పురాతన బంగారు నాణేలు, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు ఉండడంతో యజమానికి తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా పంచేసుకున్నారు. 

ఈ క్రమంలో ఓ కూలీ తనకు వచ్చిన వాటాలోని ఓ నాణేన్ని విక్రయించి కొన్ని సరుకులతోపాటు ఓ ఫోన్‌ కొనుక్కున్నాడు. మిగిలిన సొమ్ముతో మద్యం తాగాడు. ఆ మత్తులో ఉండగానే నిధి విషయాన్ని బయటపెట్టేశాడు. విషయం పోలీసులకు చేరడంతో వారు రంగంలోకి దిగారు. కూలీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కూలీలకు దొరికిన లోహపు పాత్రలోని ఆభరణాలు, నాణేల విలువ రూ. 60 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అయితే, పురావస్తు శాఖ మాత్రం ఆ సొత్తు విలువ రూ. 1.25 కోట్ల వరకు ఉంటుందని చెబుతోంది.