Vir Savarkar: వీర సావర్కార్ జైలు గది నుంచి ఓ పక్షిపై కూర్చుని ఎగిరిపోయారట... కర్ణాటక రాష్ట్ర పాఠ్యపుస్తకాల్లో విడ్డూరం

Ridiculous content about Vir Savarkar in Karnataka state text book
  • దేశం కోసం పోరాడిన సావర్కర్
  • అండమాన్ జైల్లో దుర్భర జీవితం గడిపిన యోధుడు
  • టెక్ట్స్ బుక్ లో గొప్పదనాన్ని వివరించే ప్రయత్నం 
  • జైలు గది వద్దకు బుల్ బుల్ పిట్టలు వచ్చేవని వెల్లడి
  • వాటిపై కూర్చుని మాతృభూమిని సందర్శించేవారని వివరణ
భరతమాత దాస్యశృంఖలాలను తెంచివేసేందుకు తెల్లదొరలను ఎదిరించి పోరాడిన స్వాతంత్ర్య సమర యోధుల్లో వినాయక్ దామోదర్ సావర్కర్ ఒకరు. అత్యంత కఠిన పరిస్థితులు ఉండే అండమాన్ జైల్లో వీర సావర్కర్ ఏళ్ల తరబడి మగ్గిపోయారు. తన త్యాగనిరతి, స్వాతంత్ర్య కాంక్షతో దేశ వాసులకు ఆయన ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. 

కాగా, కర్ణాటకలోని పాఠ్యపుస్తకాల్లో వీర సావర్కర్ గురించి పేర్కొన్న విషయాలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. 8వ తరగతి పాఠ్యపుస్తకంలో సావర్కర్ గొప్పదనాన్ని వివరించాలన్న ప్రయత్నం అభాసుపాలైంది. సావర్కర్ జైలు గది నుంచి ఓ బుల్ బుల్ పిట్టపై కూర్చుని ఎగిరిపోయారని ఆ టెక్ట్స్ బుక్ లో పేర్కొన్నారు. 

"సావర్కర్ ను ఉంచిన జైలు గదిలో కనీసం చిన్న రంధ్రం కూడా లేదు. అయితే ఆ గది వద్దకు బుల్ బుల్ పిట్టలు వచ్చేవి. ఆ పక్షులపై కూర్చుని సావర్కర్ ప్రతిరోజూ మాతృభూమి సందర్శనకు వెళ్లేవారు" అని అందులో వివరించారు. 

దాంతో, కర్ణాటక ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. "కర్ణాటక ప్రభుత్వ పాఠ్యపుస్తకం ప్రకారం 1911 నుంచి 1921 వరకు సావర్కర్ దినచర్య ఇదే" అంటూ ఓ నెటిజన్ సెటైర్ వేశాడు. దీనిపై కర్ణాటక టెక్ట్స్ బుక్ సొసైటీ ఎండీ మాదే గౌడ స్పందిస్తూ, టెక్ట్స్ బుక్ లోని కంటెంట్ విషయం తనకు తెలియదని అన్నారు. సంబంధిత వర్గాలను సంప్రదించి దీనిపై స్పందిస్తానని తెలిపారు.
Vir Savarkar
Bulbul Birds
Jail
Cell
Andaman
Text Book
Karnataka

More Telugu News