Nara Lokesh: రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలే ఎరువుల కొరత సృష్టిస్తున్నారు... ప్రధాని మోదీకి నారా లోకేశ్ లేఖ

  • ఎరువులను ఆదాయ వనరుగా మార్చుతున్నారని ఆరోపణ
  • ఎరువుల పంపిణీ విధానాన్ని మార్చివేశారని వివరణ 
  • ఆర్బీకేలకు తరలిస్తున్నారంటూ విమర్శ 
  • సమగ్ర విచారణ జరపాలని మోదీకి, వ్యవసాయ మంత్రికి విడివిడిగా లేఖలు
Nara Lokesh wrote PM Modi on fertilizers issue

ఏపీలో ప్రభుత్వ పెద్దలే ఎరువులు, డీఏపీ కొరత సృష్టిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆరోపించారు. ఎరువులను, డీఏపీని ఆదాయపు వనరుగా మార్చుకునేందుకు పంపిణీ విధానాన్ని మార్చివేశారని, సహకార సంఘాల ద్వారా పంపిణీ చేయాల్సిన ఎరువులను వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలకు తరలించిందని తెలిపారు. ఈ మేరకు లోకేశ్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లకు లేఖలు రాశారు. 

రాష్ట్రంలో సహకార సంఘాలకు కోత విధించి, రైతు భరోసా కేంద్రాలకు మళ్లించామని చెబుతున్నారని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 2.25 లక్షల టన్నుల డీఏపీని కేటాయించినా ప్రయోజనం లేకుండా పోయిందని, బ్లాక్ మార్కెటింగ్, రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో కృత్రిమ కొరత ఏర్పడిందని నారా లోకేశ్ పేర్కొన్నారు. తద్వారా ఓపెన్ మార్కెట్లో 50 కిలోల డీఏపీ బస్తాకు అదనంగా రూ.300 చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. 

ఏపీలో పరిస్థితులను అర్థం చేసుకుని తక్షణమే డీఏపీ సరఫరా పెంచాలని లోకేశ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఎరువులకు, డీఏపీకి కృత్రిమ కొరత ఏర్పడడంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News