ranveer singh: నగ్న ఫొటో షూట్ కేసులో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన రణ్ వీర్

  • ముంబై చెంబూరు పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాలీవుడ్ హీరో
  • రెండు గంటల పాటు అతడిని విచారించిన పోలీసులు
  • ఓ మ్యాగజైన్ కోసం నగ్నంగా ఫొటోలు దిగడంతో  రణ్ వీర్ పై కేసు
Mumbai Police records Ranveer Singh statement in nude photoshoot case

నగ్న ఫొటో షూట్ కేసులో బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ వాంగ్మూలాన్ని ముంబై పోలీసులు నమోదు చేశారు. రణ్ వీర్ సోమవారం ఉదయం 7 గంటలకు చెంబూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. దాదాపు రెండు గంటల తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చాడు. పోలీసుల ప్రశ్నలకు అతను జవాబులు ఇచ్చాడు. ఈ కేసు విషయంలో అవసరమైతే బాలీవుడ్ హీరోకు విచారణ అధికారి మరోసారి సమన్లు పంపుతారని పోలీసులు తెలిపారు.

గత నెలలో ఓ మ్యాగజైన్ కోసం రణ్ వీర్ నగ్నంగా ఫొటో షూట్లో పాల్గొన్నాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటో షూట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొందరు రణ్ వీర్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. మరికొందరు ఇదేం పనని తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రణ్ వీర్ న్యూడ్ ఫొటో షూట్ మహిళల మనోభావాలను దెబ్బతీసేలా, అసభ్యతను ప్రేరేపించేలా ఉందని, అతనిపై చర్చలు తీసుకోవాలని కొందరు ఫిర్యాదు చేశారు. దాంతో, చెంబూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. బాలీవుడ్ నటుడిపై ఐపీసీ సెక్షన్లు 292, 294 తో పాటు  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టంలోని 509, 67(ఎ) కింద కేసులు నమోదయ్యాయి. 

పోలీసుల నోటీసులు అందుకున్న తర్వాత రణ్ వీర్ విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. కాగా, బాలీవుడ్ లో ఇలాంటి కేసు నమోదవడం ఇదే తొలిసారి కాదు. ప్రముఖ మోడల్, నటుడు మిలింద్ సోమన్ 2020లో గోవా బీచ్‌లో నగ్నంగా నడిచిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీనిపై  ఐపీసీ సెక్షన్ 294, ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద అతనిపై కేసు నమోదైంది. అదే ఏడాది మోడల్, నటి పూనమ్ పాండే అసభ్యకర వీడియో షూట్ చేసిందని గోవా పోలీసులు కేసును కూడా నమోదు చేశారు.

More Telugu News