Team India: పాక్ స్పిన్నర్ల పై ఎదురుదాడి చేశా: జడేజా

Ravindra Jadeja says he tried to take the attack to the spinners
  • వాళ్లను ఎదుర్కొనేందుకు ముందుగా బ్యాటింగ్ కు  పంపారన్న జడేజా
  • కీలక భాగస్వామ్యాలతో జట్టును గెలిపించిన ఆల్ రౌండర్
  • హార్దిక్ పాండ్యాతో భాగస్వామ్యమే ముఖ్యమైనదన్న రవీంద్ర
ఆసియా కప్ లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపులో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. క్రీజులో పాతుకుపోయిన అతను కీలక భాగస్వామ్యాలతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 

సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ కంటే ముందే బ్యాటింగ్ కు వచ్చి ఆడిన ఈ ఇన్నింగ్స్ తనకెంతో ముఖ్యమైనదని రవీంద్ర జడేజా అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వికెట్లను త్వరగా కోల్పోయిన తర్వాత జట్టు జడేజాను నాలుగో నంబర్ లో బ్యాటింగ్ కు పంపించడం మాస్టర్ స్ట్రోక్ అయింది. కుడి చేతి వాటం బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్న పాక్ లెగ్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్, లెఫ్టార్మ్ స్పిన్నర్ మహ్మద్ నవాజ్‌ లను ఎదుర్కోవడానికి అతన్ని ముందుగా పంపారు. మేనేజ్ మెంట్ నమ్మకాన్ని వమ్ము చేయని జడేజా 29 బంతుల్లో రెండు ఫోర్లు, సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. 

  నాలుగో నంబర్ లో వచ్చిన తాను స్పిన్నర్లపై ఎదురుదాడి చేస్తూ జట్టును ముందుకు తీసుకెళ్లానని జడేజా చెప్పాడు. భారీ షాట్లు ఆడి వారిపై ఒత్తిడి తేవాలని అనుకున్నానని వెల్లడించాడు. కోహ్లీ, సూర్యకుమార్ ఔటైన తర్వాత హార్దిక్ పాండ్యాతో కలిసి జడేజా ఆరో వికెట్ కు అజేయంగా 52 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. లక్ష్య ఛేదనలో ఓవర్ కు 10 పరుగులు అవసరమైనప్పుడు వచ్చిన ఈ భాగస్వామ్యం చాలా కీలకమని జడేజా చెప్పాడు. ‘మా భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది. క్రీజులో ఉన్నప్పుడు మేము ఒకరిపై మరొకరం నమ్మకం ఉంచాం. సానుకూలంగా మాట్లాడుకోవడం ఫలితం ఇచ్చింది’ అని జడేజా చెప్పుకొచ్చాడు.
Team India
pakistan
asia cup
Ravindra Jadeja

More Telugu News