Hillary Clinton: ఫిన్లాండ్ ప్రధానికి సంఘీభావంగా తన డ్యాన్స్ ఫొటోను షేర్ చేసిన హిల్లరీ క్లింటన్... వైరల్ అవుతున్న ఫొటో!

  • వెలుగులోకి వచ్చిన ఫిన్లాండ్ ప్రధాని సన్నా మరిన్ పార్టీ వీడియో
  • ప్రధానిగా ఉంటూ ఇదేం పని? అంటూ విమర్శలు
  • మారిన్ కు మద్దతుగా నిలిచిన హిల్లరీ
Hillary Clintosh share her dance photo

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ డ్యాన్స్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను హిల్లరీ క్లింటన్ ట్విట్టర్ లో షేర్ చేశారు. 2012లో అమెరికా మంత్రిగా ఉన్న సమయంలో ఆమె కొలంబియా పర్యటనకు వెళ్లారు. అక్కడ కిక్కిరిసిపోయిన ఒక క్లబ్ లో ఆమె నవ్వులు చిందిస్తూ డ్యాన్స్ చేశారు. 

ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్ కు మద్దతుగా ఆమె ఈ ఫొటోను షేర్ చేశారు. 'కీప్ డ్యాన్సింగ్ సన్నా మారిన్' అంటూ హిల్లరీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. హిల్లరీ క్లింటన్ ఫొటో షేర్ చేసిన వెంటనే సన్నా మారిన్ స్పందించారు. థాంక్యూ హిల్లరీ క్లింటన్ అని రిప్లై ఇచ్చారు. 

36 ఏళ్ల సన్నా మారిన్ కొందరు స్నేహితులు, సెలబ్రిటీలతో కలిసి డ్యాన్స్ చేస్తూ పార్టీ చేసుకుంటున్న వీడియో ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీంతో, ఆమెపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక ప్రధానిగా ఉంటూ ఇలా ఎలా చేస్తారని విమర్శిస్తున్నారు. మరోవైపు, మారిన్ కు చాలా మంది తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. ఆమెకు మద్దతుగానే హిల్లరీ క్లింటన్ కూడా తాను డ్యాన్స్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. 


ప్రపంచంలోనే పిన్న వయస్సు కలిగిన ప్రధానిగా మారిన్ ఉన్నారు. మరోవైపు తనపై వస్తున్న విమర్శలపై ఆమె స్పందిస్తూ... తాను కూడా మనిషినే అని చెప్పారు. తాను కూడా అందరి మాదిరే కొన్నిసార్లు ఎంజాయ్ చేస్తానని అన్నారు. ప్రధానిగా తాను ఒక్క రోజు కూడా పనిని మిస్ కాలేదని చెప్పారు. మరోవైపు, 74 ఏళ్ల హిల్లరీ క్లింటన్ బరాక్ ఒబామా ప్రభుత్వంలో 2009 నుంచి 2013 వరకు మంత్రిగా పని చేశారు.

More Telugu News