India: వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ హోదాను కోల్పోయే ప్రమాదంలో భారత్

  • ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
  • దేశాన్ని ఇబ్బంది పెడుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం
  • వార్షిక వృద్ధి 6.2 శాతానికి దిగజారవచ్చని అంచనా
India Risks Losing Its Status As Worlds Fastest Growing Economy

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన భారత్ ఇప్పుడా ట్యాగ్‌ను కోల్పోయే ప్రమాదంలో పడింది. గత త్రైమాసికంలో రెండంకెల వృద్ధిని సాధించినప్పటికీ ఈ త్రైమాసికంలో సగానికి పైగా తగ్గే అవకాశం ఉందని ‘రాయిటర్స్’ పోల్‌లో ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్లు పెరిగే కొద్దీ ఈ ఏడాది చివరినాటికి ఇది మరింత మందగించే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన భారత్‌ను నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఇబ్బంది పెడుతున్నాయి.

ఈ త్రైమాసికంలో వృద్ధి క్యూ2 (క్వార్టర్ 2)లో 15.2 శాతం మధ్యస్థ అంచనా నుంచి వార్షికంగా 6.2 శాతానికి మందగించవచ్చని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. ఇది మరింత క్షీణించడానికి ముందు అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో 4.5 శాతానికి పడిపోవచ్చని చెబుతున్నారు. 
ఆగస్టు 22-26 మధ్య జరిగిన రాయిటర్స్ పోల్ ప్రకారం.. 2022 వృద్ధి మధ్యస్థ అంచనా 7.2 శాతం కాగా, మున్ముందు ఇది వేగంగా నెమ్మదిస్తుందని ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నప్పటికీ నిరుద్యోగం ఎక్కువగా ఉండడం, వాస్తవ వేతనాలు రికార్డు స్థాయిలో తక్కువగా ఉండడంతో దేశీయ వినియోగం వృద్ధిని పెంచేంత బలంగా ఉండకపోవచ్చని భారత ఆర్థికవేత్త కునాల్ కుందు పేర్కొన్నారు.

ప్రతి ఏడాది 12 మిలియన్ల మంది శ్రామికశక్తిలో చేరేంత వేగంగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందలేదని ఆయన అన్నారు. రాయిటర్స్ తాజా పోల్ ప్రకారం.. భారత్ కరెంట్ ఖాతా లోటు ఈ ఏడాది స్థూల దేశీయోత్పత్తిలో 3.1 శాతానికి పెరిగింది. ఒక దశాబ్ద కాలంలో ఇదే అత్యధికం. కాబట్టి ఇది కరెన్సీపై మరింత ఒత్తిడి పెంచొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేశారు.

More Telugu News