Twin Towers: నోయిడాలో సూపర్ టెక్ ట్విన్ టవర్స్ ఇలా నేలమట్టం అయ్యాయి... వీడియో ఇదిగో!

  • నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా టవర్స్ నిర్మాణం
  • కూల్చివేయాలన్న సుప్రీంకోర్టు
  • 3,700 కిలోల పేలుడు పదార్థంతో కూల్చివేత
  • 12 సెకన్లలో కుప్పకూలిన టవర్స్
Noida Twin Towers demolished

ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో నిబంధనలు పాటించకుండా నిర్మించిన సూపర్ టెక్ ట్విన్ టవర్స్ అపెక్స్, సియాన్ నేలమట్టం అయ్యాయి. ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు అధికారులు ఈ టవర్స్ ను కూల్చివేశారు. అందుకోసం 3,700 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించారు. 100 మీటర్ల దూరం నుంచి బటన్ నొక్కగా... కేవలం 12 సెకన్ల వ్యవధిలోనే ఈ ట్విన్ టవర్స్ కుప్పకూలాయి. 

ఈ జంట భవనాలు కూలిపోగా ఎగిసిన ధూళి కొన్ని వందల మీటర్ల వరకు వ్యాపించింది. కాగా, ఈ ట్విన్ టవర్స్ చుట్టు పక్కల భవనాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించిన సంగతి తెలిసిందే.

2009లో సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీ ఈ ట్విన్ టవర్స్ ను రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాతిపదికన నిర్మించింది. ఇందుకు గాను రూ.70 కోట్ల వ్యయం అయింది. మూడేళ్లలో ఈ టవర్స్ నిర్మించారు. ఈ జంట టవర్స్ లోని అపెక్స్ టవర్ ఎత్తు 102 మీటర్లు కాగా, ఇందులో 32 అంతస్తులు ఉన్నాయి. సియాన్ టవర్స్ ఎత్తు 95 మీటర్లు. ఈ రెండు టవర్లలో 915 ఫ్లాట్లు, 21 షాపింగ్ కాంప్లెక్స్ లు ఉన్నాయి. 

అయితే నిబంధనలను ఉల్లంఘించి ఈ టవర్స్ కట్టారంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, టవర్స్ ను కూల్చేయాలంటూ గతేడాది తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే నేడు నోయిడా ట్విన్ టవర్స్ ను కూల్చివేశారు. 

కుతుబ్ మినార్, ఇండియా గేట్ కంటే ఎత్తయిన ఈ భారీ టవర్స్ ను కూల్చివేసేందుకు అధికారులు రూ.20 కోట్లు ఖర్చు చేశారు. శిథిలాల తొలగింపునకు మరో రూ.13.5 కోట్లు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు.

More Telugu News