Amit Shah: 2024 ఎన్నికలకు ముందు అన్ని రాష్ట్రాల్లో ఎన్ఐఏ కార్యాలయాలు: అమిత్ షా

NIA to have offices in all states before  2024 LS polls assures Amit shah
  • ఎన్ఐఏను ఫెడరల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా మార్చాలని కేంద్రం కోరుకుంటోందన్న షా
  • రాయ్‌పూర్ బ్రాంచ్ ఎన్ఐఏ  కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి
  • ఉగ్రవాదం, సంబంధిత నేరాలను మోదీ సర్కారు ఉపేక్షించడం లేదని వ్యాఖ్య
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు అన్ని రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. తద్వారా ఎన్ఐఏను ఫెడరల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా మార్చాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. రాయ్‌పూర్ బ్రాంచ్ ఎన్ఐఏ  కార్యాలయాన్ని షా.. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్, మాజీ సీఎం రమణ్ సింగ్, కేంద్ర మంత్రి రేణుకా సింగ్ తదితరులతో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా ఎన్ఐఏ ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక ప్రధాన దర్యాప్తు సంస్థగా గుర్తింపు పొందిందన్నారు. ఒక చిన్న పతనం తరువాత, ఏజెన్సీ తన లక్ష్యాలన్నింటినీ సాధించగలిగిందని పేర్కొన్నారు. ఉగ్రవాదం, దాని సంబంధిత నేరాలను మోదీ ప్రభుత్వం ఉపేక్షించడం లేదన్నారు. ఉగ్రవాద దర్యాప్తులో మెరుగైన సమన్వయం కోసం విదేశీయులకు చెందిన దర్యాప్తు సంస్థలతో సంబంధాలను ఏర్పరచుకునే దిశగా ఎన్ఐఏ పనిచేస్తోందని చెప్పారు.

అనంతరం బీజేపీ ఏర్పాటు చేసిన సెమినార్‌లో షా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని మళ్లీ గెలిపిస్తే రాష్ట్రంలో నక్సలిజం అంతమైపోతుందన్నారు. ‘మోదీ @20: డ్రీమ్స్ మీట్ డెలివరీ’ - అనే పుస్తకంపై జరిగిన ఈ సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. ‘బంధుప్రీతితో పోరాడి మోదీ ప్రధాని అయ్యారు. ఆయన పేద కుటుంబం నుంచి వచ్చారు. అణగారిన వర్గాల సంక్షేమంపై దృష్టి పెట్టారు’ షా అని చెప్పారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సీఎం బఘెల్.. ఎన్ఐఏ చేసిన పనిని అభినందించారు. రాష్ట్రంలో వారసత్వంగా వచ్చిన నక్సలిజం కారణంగా చాలా మందిని పోగొట్టుకున్నామన్నారు. కానీ, ఇప్పుడు నక్సలిజం శరవేగంగా కుంచించుకుపోతోందని చెప్పారు.
Amit Shah
nia
2024
elections
modi

More Telugu News