JP Nadda: అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ లో భయం మొదలైంది: హన్మకొండ సభలో జేపీ నడ్డా

  • హన్మకొండలో బీజేపీ బహిరంగ సభ
  • హాజరైన జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్
  • కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించిన నడ్డా
  • నయా నిజాం అంటూ వ్యాఖ్యలు
  • ప్రజాస్వామ్యాన్ని బందీ చేస్తున్నాడని వెల్లడి
JP Nadda take a swipe at CM KCR in Hanmakonda rally

బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండలో ఏర్పాటు చేసిన సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ బందీ చేశారని వ్యాఖ్యానించారు. ఇవాళ హన్మకొండ సభకు అడుగడుగునా ఆంక్షలు విధించారని, 144 సెక్షన్ ను చూపించి ప్రజానీకం రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. హైకోర్టు అనుమతితో సభ జరుపుకుంటున్నామని తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వ నిధులను కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. జల్ జీవన్ మిషన్ కింద తెలంగాణకు కేంద్రం రూ.3,500 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. తెలంగాణ సర్కారు రూ.200 కోట్లు మాత్రమే ఖర్చుచేసిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని అన్నారు. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పి వరంగల్ జైలును కూల్చారని, ఇప్పటికీ ఆసుపత్రి నిర్మాణం జరగలేదని వెల్లడించారు. 

తెలంగాణను ఈ నయా నిజాం దోచేస్తున్నాడని నడ్డా వ్యాఖ్యానించారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ బాటలోనే కేసీఆర్ నడుస్తున్నాడని పేర్కొన్నారు. ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడంలేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అంధకారంలో ఉందని తెలిపారు. తెలంగాణను చీకటి నుంచి బయటపడేసేందుకే బండి సంజయ్ పాదయాత్ర జరిపారని నడ్డా వెల్లడించారు. టీఆర్ఎస్ సర్కారును సాగనంపడమే పాదయాత్ర ఉద్దేశమని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ లో భయం మొదలైందని అన్నారు. ప్రజలు త్వరలోనే కేసీఆర్ ను ఇంటికి పంపిస్తారని ఉద్ఘాటించారు.

More Telugu News