'బ్రహ్మాస్త్రం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా ఎన్టీఆర్

27-08-2022 Sat 18:00 | Both States
  • రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా బ్రహ్మాస్త్ర
  • తెలుగులో బ్రహ్మాస్త్రంగా వస్తున్న భారీ బడ్జెట్ మూవీ
  • కీలకపాత్రలో నాగార్జున
  • సెప్టెంబరు 2న రామోజీ ఫిలిం సిటీలో ప్రీ రిలీజ్ వేడుక
  • సెప్టెంబరు 9న విడుదల
NTR as Chief Guest for Brahmastra Pre Release event
బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ చిత్రం తెలుగులో 'బ్రహ్మాస్త్రం మొదటి భాగం: శివ' పేరుతో రిలీజ్ అవుతోంది. కాగా, బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబరు 2న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ భారీ వేడుకకు రామోజీ ఫిలిం సిటీ వేదికగా నిలుస్తోంది. ఈ బహుభాషా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా విచ్చేస్తున్నారు. ఈ మేరకు చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది. 

రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్ నటించిన బ్రహ్మాస్త్రం చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపిస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని తెలుగులో దర్శకుడు రాజమౌళి సమర్పిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ చిత్రం సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.