Nirmala Sitharaman: ఉచిత హామీలు ఇచ్చి ఉంటే వాటికి బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించండి: రాజ‌కీయ పార్టీల‌కు నిర్మ‌లా సీతారామ‌న్ సూచ‌న‌

  • ముంబైలో ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన నిర్మల‌
  • ఉచిత హామీలు ఇస్తున్న పార్టీలను ప్ర‌స్తావించిన కేంద్ర మంత్రి
  • హామీలిచ్చి నిధులు కేటాయించ‌క‌పోతే వ్య‌వ‌స్థ‌పై భార‌మ‌ని వెల్ల‌డి
union finance minister nirmala sitharaman comments on free schemes

ఎన్నిక‌ల్లో ఓట్ల‌ను రాబ‌ట్టేందుకు చాలా పార్టీలు ఉచిత హామీల‌ను గుప్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఎన్నిక‌లు ముగిశాక ఆయా పార్టీలు ఓ మోస్త‌రుగా ఉచిత హామీల‌ను అమ‌లు చేసి ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను ఛిన్నాభిన్నం చేస్తున్న వైనం తెలిసిందే. ఈ త‌ర‌హా ప‌రిస్థితిపై కేంద్ర ఆర్ఙిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ శుక్రవారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఉచిత హామీలు ఇచ్చే పార్టీలు అధికారంలోకి వ‌చ్చాక ఆ హామీల అమ‌లు కోసం బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించాల‌ని ఆమె పిలుపునిచ్చారు.

ముంబైలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సంద‌ర్భంగా శుక్ర‌వారం నిర్మ‌లా సీతారామ‌న్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఉచిత విద్యుత్ హామీని నిర్మ‌ల ప్ర‌స్తావించారు. ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి ఉంటే.. దాని అమ‌లు కోసం ఆయా పార్టీల ప్ర‌భుత్వాలు బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించాల‌ని ఆమె సూచించారు. 

పార్టీలు ఇచ్చిన ఉచిత హామీల వ‌ల్ల ఆయా వ్య‌వ‌స్థ‌లు ఎందుకు భారం మోయాలి? అని కూడా ఆమె ప్ర‌శ్నించారు. ఉచిత విద్యుత్ హామీ ఇచ్చిన పార్టీలు త‌మ బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించ‌కుంటే.. ఉచిత విద్యుత్ అమ‌లు వ‌ల్ల స‌ద‌రు రాష్ట్ర ట్రాన్స్‌కోపై భారం ప‌డుతుంద‌ని ఆమె అన్నారు. అదే విధంగా జెన్‌కోపైనా భారం త‌ప్ప‌దు క‌దా అని నిర్మ‌ల పేర్కొన్నారు. స‌మ‌స్య ఉచిత హామీల వల్ల కాద‌న్న నిర్మ‌ల‌... ఆ హామీల అమ‌లుకు నిధులు కేటాయించ‌క‌పోవ‌డ‌మేన‌ని తెలిపారు.

More Telugu News