Chandrababu: నీ మాదిరి నేను పోలీసులను వినియోగించి ఉంటే.. నీవు బయట తిరిగేవాడివా?: చంద్రబాబు ఫైర్

  • కుప్పంలో మూడో రోజు కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన
  • ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు
  • రాజకీయాలే తప్ప అభివృద్ధే లేదని మండిపాటు
  • అన్నాడీఎంకే హయాంలో ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లను స్టాలిన్ కొనసాగిస్తున్నారని వ్యాఖ్య
  • పోలీసులు సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం 
Chandrababu fires on Jagan

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. ఈ రోజు ఆయన కుప్పం వీధుల్లో రోడ్ షో నిర్వహించారు. ఎక్కడికక్కడ జనాలతో మాట్లాడుతూ ముందుకు సాగారు. కుప్పం మోడల్ కాలనీలో ఆయన పర్యటించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 650 గృహాలతో మోడల్ కాలనీ నిర్మాణాన్ని ప్రారంభించామని... 1 ప్లస్ 3 విధానంతో 3 వేల మందికి దీన్ని విస్తరించాలనే ఉద్దేశంతో ప్రణాళికలను రూపొందించి అనుమతులు ఇచ్చామని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్ల నిర్మాణాన్ని ఆపేశారని మండిపడ్డారు. 

కుప్పంపై ఏదో ప్రత్యేకమైన ప్రేమ ఉన్నట్టు జగన్ అంటున్నారని... అంత ప్రేమ ఉంటే తాను 3 వేల ఇళ్లను కట్టిస్తే... ఆయన 10 వేల ఇళ్లను కట్టించాలని చంద్రబాబు ఛాలెంజ్ చేశారు. వైసీపీ పాలనలో రాజకీయాలు తప్ప అభివృద్ధే లేదని విమర్శించారు. జగన్ నియోజకవర్గం పులివెందులను తాను అభివృద్ధి చేశానని... గండికోట నుంచి నీళ్లిచ్చానని చెప్పారు. 

కుప్పం చరిత్రలో నిన్న ఒక చీకటి రోజని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పేద వాడి పొట్ట నింపే అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేశారని మండిపడ్డారు. క్యాంటీన్ నిర్వాహకుడిపై కూడా దాడి చేశారని చెప్పారు. అన్నా డీఎంకే ప్రభుత్వంలో ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటికీ కొనసాగిస్తున్నారని... ఇక్కడేమో ఈయన అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాంటీన్లను ఎత్తేశాడని దుయ్యబట్టారు. 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద వందలాది మంది పోలీసులను భద్రతగా పెట్టారని... ఇదే పోలీసులను అన్నా క్యాంటీన్ వద్ద ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులు సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఇలాగే పోలీసులను వినియోగించి ఉంటే నీవు బయట తిరిగే వాడివా? అని జగన్ ను ఉద్దేశించి అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా ఎస్పీ కుప్పంలో ఉన్నప్పుడే వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని, ఈ పరిణామాలన్నింటికీ డీజీపీ సమాధానం చెప్పాలని చంద్రబాబు అన్నారు.

More Telugu News