సీజేఐ ఎన్వీ రమణ వీడ్కోలు సభలో కన్నీటిపర్యంతమైన సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే... వీడియో ఇదిగో!

  • నేడు సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ
  • సుప్రీంకోర్టులో వీడ్కోలు కార్యక్రమం
  • తీవ్ర భావోద్వేగాలకు గురైన దవే
  • ఎన్వీ రమణను ప్రజా న్యాయమూర్తిగా అభివర్ణించిన వైనం
Senior advocate Dushyant Dave breaks into tears in CJI NV Ramana farewell meeting

భారత ప్రధాన న్యాయమూర్తిగా తనదైన ముద్రవేసిన జస్టిస్ ఎన్వీ రమణ నేడు పదవీ విరమణ చేస్తున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఇవాళ్టితో ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. జస్టిస్ ఎన్వీ రమణ గుణగణాలను కీర్తిస్తూ సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. కోర్టు హాల్లోనే కన్నీటిపర్యంతమయ్యారు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ వణుకుతున్న గొంతుకతో మాట్లాడారు. 

ఎన్వీ రమణ తన పదవీకాలంలో ఓ ప్రజా న్యాయమూర్తిగా వన్నెకెక్కారని కొనియాడారు. ఎంతో నిబద్ధత, నిజాయతీతో, ఎవరికీ తలొగ్గని నైజంతో సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించారని పేర్కొన్నారు. ఆయన పదవిని చేపట్టినప్పుడు కొంచెం ఆందోళన కలిగినా, తన పదవీకాలంలో అందరి అంచనాలకు మించి రాణించారని కితాబునిచ్చారు. రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థను, న్యాయవాదులను ఎంతో గౌరవించిన వ్యక్తిగా జస్టిన్ ఎన్వీ రమణ నిలిచిపోతారని దుష్యంత్ దవే తెలిపారు. 

"మీరు అద్భుతమైన రాజ్యాంగ విలువలు, రాజ్యాంగ పరమైన నైతికతను నెలకొల్పారు. హక్కులను కాపాడేందుకు మీరు తపించారు. ఎక్కడా సమతుల్యత దెబ్బతినకుండా మీ వంతు కృషి చేశారు. మీ ముందు నిలబడి వాదనలు వినిపించడాన్ని నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. ఇప్పుడు మీరు జస్టిస్ లలిత్, జస్టిస్ కోహ్లీ వంటి సమర్థులైన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టును అప్పగించి వెళ్లిపోతున్నారు. 

సుప్రీంకోర్టును ఒక శక్తిగా మలచడంలోనూ, సుప్రీంకోర్టుకు వస్తే న్యాయం జరుగుతుందన్న భరోసా పూరిత వాతావరణం కల్పించడంలోనూ మీరు విజయవంతం అయ్యారు. అందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ ఒరవడిని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది" అంటూ దుష్యంత్ దవే ప్రసంగించారు.

More Telugu News