Leaf Sheep: ‘ఆకు గొర్రె’.. జంతువులా తింటుంది.. మొక్కలా బతుకుతుంది.. సరికొత్త సముద్ర జీవి వీడియో ఇదిగో

Leaf sheep Different organism that runs on solar power
  • సముద్రంలో జీవించే అరుదైన నత్త జాతికి చెందిన జీవి
  • శరీరంపై ఆకుల్లాంటి నిర్మాణాలు.. గొర్రెను తలపించే ముఖం
  • జంతువులా నాచును తింటూ.. మొక్కల్లా సూర్యరశ్మితో శక్తిని ఉత్పత్తి చేసుకునే అరుదైన జీవి
అది సముద్రంలో ఉండే ఓ జీవి. తల భాగం చూడటానికి గొర్రెలాంటి ఆకృతిలో ఉంటుంది. శరీరం చూస్తే.. ఈకల్లా ఆకులు అతికించినట్టుగా మరింత చిత్రంగా ఉంటుంది. సముద్రంలో నాచును తింటూ తిరుగుతుంది. కానీ అదే సమయంలో మొక్కల్లా సూర్యరశ్మిని గ్రహించి శరీరంలో శక్తిని ఉత్పత్తి చేసుకోగలుగుతుంది. ఆ చిత్రమైన జీవి ఓ నత్త. దాని పేరు ‘కోస్టాసీల్లా కురోషిమే’. ముద్దుగా ‘లీఫ్ షీప్ (ఆకు గొర్రె)’గా పిలుచుకుంటుంటారు.

అన్ని చిత్రమైన లక్షణాలే..
  • లీఫ్ షీప్ కు తల భాగంలో రెండు నల్లటి కళ్లు, వాటికి కాస్త పైన పొడుగాటి రెండు కొమ్ముల్లాంటి భాగాలు (రైనోపోర్స్) ఉంటాయి. ఇవి గొర్రె చెవుల్లా కనిపిస్తుంటాయి. తల కూడా గొర్రె ఆకారంలో ఉంటుంది.  
  • ఇక దీని శరీర భాగంలో ఆకుల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. అవి నత్తకు సంబంధించి వివిధ ఎంజైమ్ లను ఉత్పత్తి చేసే గ్రంధులు. వీటిల్లోనే క్లోరోఫిల్ ఉండి సూర్యరశ్మిని గ్రహించి లీఫ్ షీప్ కు శక్తిని అందిస్తాయి. అందువల్లే లీఫ్ షీప్ లను ‘సోలార్ పవర్డ్ స్లగ్స్ (సౌర శక్తితో బతికే నత్తలు)’ అని కూడా పిలుస్తుంటారు.
  • ఫొటోలో చూడటానికి పెద్దగా ఉన్నా.. ఈ లీఫ్ షీప్ లు జస్ట్ ఐదు మిల్లీమీటర్ల నుంచి పది మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటాయి.
  • జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ సముద్ర తీరాల్లో ఈ నత్తలు కనిపిస్తుంటాయి.
  • సముద్రంలో ఈ నత్త కదులుతూ వెళుతుండటం చూస్తుంటే.. ఏదో యానిమేటెడ్ సినిమాలో గొర్రె కదులుతున్నట్టుగా ఉంటుంది కూడా.

Leaf Sheep
Oceant
Different organism
Sea Slugs
Solar
Offbeat
Viral Videos

More Telugu News