Indians: గుండె జబ్బుల ముప్పు మనకే ఎక్కువ.. ముందుగా గుర్తిస్తేనే రక్షణ!

  • పాశ్చాత్యులతో పోలిస్తే ముప్పు ఎంతో ఎక్కువ
  • జంక్ ఫుడ్ ను దూరం పెట్టాల్సిందే
  • రోజువారీ వ్యాయామం చేయాల్సిందే
  • ఆల్కహాల్, పొగాకుకు దూరంగా ఉండాలి 
  • ఏటా వైద్య పరీక్షలు చేయించుకోవాలి 
Are Indians more prone to heart attacks Why you must start health check ups early

ఇటీవలి కాలంలో ముఖ్యంగా కరోనా మహమ్మారి ప్రవేశించిన తర్వాత నుంచి.. 40-60 ఏళ్ల మధ్య వయస్కుల్లో గుండె జబ్బుల మరణాలు పెరుగుతున్నాయి. పునీత్ రాజ్ కుమార్, మేకపాటి గౌతమ్ రెడ్డి ఇలా చిన్న వయసులో హార్ట్ ఎటాక్ కు బలైనవారే. 18-20 ఏళ్ల వయసు వారిలోనూ గుండె జబ్బులు కనిపిస్తున్నట్టు వైద్యులు చెబుతుండడం ఆందోళన కలిగించే అంశం.


ముప్పు ఎక్కువే..?
పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయుల ఆహారం వేరుగా, ఆరోగ్య సుగుణాలతో ఉంటుందని వింటుంటాం. కానీ, ఇప్పుడు పాశ్చాత్యులతో పోలిస్తే భారతీయులే ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతుండడం గమనించాలి. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయుల్లో, దక్షిణాసియా వాసుల్లో గుండె జబ్బుల ముప్పు రెట్టింపు ఉంటోంది.

ప్రజారోగ్య విభాగం గణాంకాలను పరిశీలిస్తే.. ప్రపంచ గుండె జబ్బుల బాధితుల్లో 60 శాతం భారత్ లోనే ఉన్నారు. కానీ, ప్రపంచ జనాభాలో భారతీయులు 20 శాతంలోపే ఉండడాన్ని గమనించాలి. ఇతర దేశాల వారితో పోలిస్తే 33 శాతం ముందస్తు గుండె జబ్బుల ముప్పు మనకు ఉంటోంది. భారత్ లో ప్రతి లక్ష మంది జనాభాకు గుండె జబ్బుల మరణాలు 272గా ఉంటున్నాయి. అంతర్జాతీయ సగటు 232 కంటే ఎక్కువ అని తెలుస్తోంది. 

ఎందుకని?
భారత్ లోని ప్రముఖ ఆసుపత్రుల్లో పనిచేసే గుండె వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ప్రపంచంలో మరే ఇతర జనాభా వర్గంతో పోల్చి చూసినా భారతీయులకే గుండె జబ్బుల ముప్పు ఎక్కువ. అమెరికన్ల కంటే 3.4 రెట్ల అధిక ముప్పు మనకు ఉంది. జపాన్ వాసులతో పోలిస్తే 20 రెట్లు అధికం. ఇతర జనాభా సమూహాలతో పోలిస్తే భారతీయులు 5-10 ఏళ్ల ముందుగానే గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఇక మన దేశ వాసులకు రెండో సారి హార్ట్ ఎటాక్ వచ్చే ముప్పు మూడు రెట్లు ఎక్కువ. మరణాల రేటు రెండు రెట్లు అధికం.

దీనికి కచ్చితమైన కారణాన్ని చెప్పలేకున్నామని గుండె వైద్యులు అంటున్నారు. భారతీయులు కేలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం కారణమై ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జీవనశైలిని కారణంగా చెబుతున్నారు. 

‘‘జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం పెరిగింది. చాలా వరకు సంప్రదాయ ఆహారాల్లో భాగంగా వినియోగించే దినుసులు, నూనె ఆరోగ్యానికి మంచివి కావు. మధుమేహం, రక్తపోటుకు కారణం అవే. ఇవి గుండె జబ్బులను పెంచుతాయి’’ అని అహ్మదాబాద్ కు చెందిన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జీషన్ మన్సూరి తెలిపారు. పాశ్చాత్య ఆహారం మన జన్యువులకు అనుకూలం కాదని, గుండె జబ్బులకు ఇదే కారణమని ఆయన చెబుతున్నారు. ఇది కేవలం అంచనాయే కానీ, శాస్త్రీయ ఆధారాలతో చెప్పడం లేదన్నారు. 

గురుగ్రామ్ కు చెందిన డాక్టర్ అమిత్ భూషణ్ శర్మ అయితే జన్యువులను కారణంగా చెబుతున్నారు. ‘‘లిపోప్రొటీన్ (రక్తనాళాల గోడలపై చేరి రక్త ప్రవాహాన్ని అడ్డుకునే చెడు కొవ్వు) పెరిగే రిస్క్ మనలో ఎక్కువ. భారతీయులకు స్వతహాగానే గుండె రేటు ఎక్కువ. ఒకేసారి ఒకటికి మించిన టాస్క్ లు చేస్తుంటాం. కాలుష్యం, నిశ్చలమైన జీవనం (వ్యాయామం లేకపోవడం), పెరుగుతున్న పని ఒత్తిడి, పోషకాహార లోపం, మంచి నిద్ర లోపించడం కూడా కారణాలే’’ అని వివరించారు. మధుమేహాన్ని కూడా ఆయన గుండె జబ్బులకు ప్రధాన వాహకంగా చెబుతున్నారు. 

నివారణ మార్గం..
భారతీయులకు గుండె జబ్బుల రిస్క్ సహజంగానే ఎక్కువ. పైగా మారిన జీవనశైలి, కాలుష్యంతో ఈ ముప్పు పెరిగింది కనుక ముందస్తు వైద్య పరీక్షలే మెరుగైన రక్షణగా వైద్యులు చెబుతున్నారు. ముందుగా గుర్తించడం వల్ల మంచి చికిత్సతో సమస్యను ఆదిలోనే పెద్దది కాకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. 20 ఏళ్లు వచ్చిన నాటి నుంచి ఏటా స్క్రీనింగ్ అవసరమని సూచిస్తున్నారు. 

జీవనశైలి మార్పులు
కనీసం రోజులో 30-40 నిమిషాలు వ్యాయామం చేయాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో రోజులో కాస్తంత సమయాన్ని వెచ్చించాలి. దీనివల్ల ఒత్తిళ్లు తగ్గిపోతాయి. పురోగతి కోసం రోజంతా పనిచేయడం కాకుండా, ఉద్యోగం, ఇంటికి తగినంత సమయం కేటాయించాలి. పొగతాగడం, ఆల్కహాల్ సేవనానికి దూరంగా ఉండాలి. ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, స్నాక్స్ ను తీసుకోవద్దు. ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు తినొద్దు. చక్కెరలకు కూడా దూరంగా ఉండాలి. రోజువారీ కనీసం రెండు రకాల పండ్లు తీసుకోవాలి. శరీర బరువు పెరగకుండా చూసుకోవాలి. కనీసం 8 గంటల పాటు నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి.

More Telugu News