రాజకీయ పార్టీల ‘ఉచిత తాయిలాల’ కేసు మరో త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్​ చేసిన సీజేఐ

  • ఉచితాలను నియంత్రించాలన్న పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు
  • ప్రజాస్వామ్యంలో నిజమైన అధికారం ఓటర్లదేనన్న ధర్మాసనం
  • ఉచితాల విషయంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్య
Supreme Court refers election freebies case to 3 judge bench

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు చేసే ఉచిత తాయిలాల వాగ్దానాలను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ శుక్రవారం మరో త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేశారు. న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమా కోహ్లిలతో కూడిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఎన్నికల ప్రజాస్వామ్యంలో నిజమైన అధికారం ఓటర్లదేనని అభిప్రాయపడింది. ఓటర్లు.. పార్టీలు, అభ్యర్థులకు న్యాయనిర్ణేతగా ఉంటారనేది కాదనలేని విషయమని పేర్కొంది.

‘పన్ను చెల్లింపుదారుల నిధులను ఉపయోగించి అందించే ఉచితాలు పార్టీల ప్రజాదరణను పెంచే లక్ష్యంతో రాష్ట్రానికి ఉచితాలు అందించలేని పరిస్థితిని సృష్టించవచ్చని సొలిసిటర్ జనరల్, భారత ఎన్నికల సంఘం, ఇతర పార్టీలు పేర్కొన్నాయి. మేము అన్ని కోణాల నుంచి ఈ పరిస్థితిని పరిశీలించాము. అంతిమంగా నిర్ణయం ఓటర్ల చేతుల్లోనే ఉంటుంది. పార్టీల పనితీరును వాళ్లే నిర్ణయిస్తారు’ అని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు.  

సీజేఐగా తన చివరి పని రోజున ప్రధాన న్యాయమూర్తి రమణ ఈ తీర్పును వెలువరించారు. ఈ విషయంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. 2013 నాటి బాలాజీ తీర్పును ప్రస్తావిస్తూ టీవీలు మొదలైనవాటిని పంపిణీ చేయడం సంక్షేమ చర్య అని, అది ఉచిత ప్రయోజనం కాదనీ అన్నారు. ఉచితాల విషయాన్ని ఇప్పుడు మరో త్రిసభ్య ధర్మాసనం పునఃపరిశీలించనుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

అంతకుముందు బుధవారం ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు ఉచితాలను వాగ్దానం చేసే ఆచరణకు సంబంధించిన తీవ్రమైన అంశంపై చర్చ తప్పక జరగాలని అన్నారు. దానిపై కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. ఉచితాలు ఆర్థిక వ్యవస్థను నాశనం చేయబోతున్నాయని, వాటిని నిలిపివేయాలని రాజకీయ పార్టీల మధ్య ఏకగ్రీవ నిర్ణయం వచ్చేంత వరకు ఇవి ఆగవని కోర్టు అభిప్రాయపడింది.

More Telugu News