Texas woman: డల్లాస్ లో భారతీయ అమెరికన్ మహిళలపై మెక్సికన్ మహిళ దాడి.. బండ బూతులు

  • మాటకు ముందు బూతు పదం తలిగించి ఇష్టారీతిన దూషణ
  • ఫోన్లో రికార్డు చేస్తుండడంతో చేత్తో దాడి 
  • భారత్ లో బతకలేక వచ్చారంటూ తిట్లు 
  • ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేసిన పోలీసులు
Texas woman arrested for assaulting Indian Americans Video viral

భారతీయ అమెరికన్ మహిళలపై డల్లాస్ లో ఓ మహిళ దాడికి పాల్పడింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లోకి చేరడంతో సంచలనంగా మారింది. సదరు మహిళ జాతి వివక్ష చర్యలను అందరూ ఖండిస్తున్నారు. ఈ ఘటన గత బుధవారం రాత్రి డల్లాస్ లోని ఓ రెస్టారెంట్ పార్కింగ్ లాట్ వద్ద చోటు చేసుకుంది. 

అక్కడ భారతీయ మహిళలు కొందరు ఉండగా, మద్యం సేవించిన మెక్సికన్ అమెరికన్ మహిళ ఉన్నట్టుండి తిట్టడం మొదలు పెట్టింది. దాన్ని భారత సంతతి మహిళలు వీడియో తీస్తుండడంతో వచ్చి చేత్తో దాడికి దిగింది. తాను కూడా వీడియో తీస్తున్నానంటూ అతి చేసింది. సదరు మహిళను మెక్సికోకు చెందిన ఎస్మెరాల్డ అప్టాన్ గా గుర్తించారు. తీవ్రవాద తరహా బెదిరింపులు, దాడి చేసి గాయపరచడం వంటి అభియోగాలపై ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. 

‘‘మిమ్మల్ని అసహ్యించుకుంటున్నాను.. భారతీయుల్లారా.. మెరుగైన జీవితం కోసం మీరు అమెరికాకు వచ్చారు. అంటే, స్పష్టంగా భారత దేశంలో మెరుగైన జీవితం గడపడం లేదు’’ అని సదరు మహిళ దూషణకు దిగింది. ఎందుకు జాతి వివక్ష దాడికి దిగుతున్నావంటూ భారతీయ మహిళ ప్రశ్నించగా.. ‘‘మీరు భారత్ నుంచి ఇక్కడకు వచ్చారు. అన్నీ ఉచితంగా కోరుకుంటున్నారు. నేను మెక్సికన్ అమెరికన్. ఇక్కడే పుట్టాను. మీరు ఇక్కడ ఎక్కడ జన్మించారు? మీ మాట్లాడే తీరు వల్లే అసహ్యించుకుంటున్నాను’’ అని దూషించింది. 

భారత్ లో జీవితం గొప్పగా ఉంటే మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు? అని ప్రశ్నించింది. ప్రతి మాటకు ముందు బూతు పదం వాడుతూ పూనకం వచ్చినట్టు ఇష్టారీతిన మాట్లాడింది. దీని తర్వాత భారతీయ మహిళల్లో ఒకరు 911 నంబర్ కు కాల్ చేసి సాయం కోరారు. నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడకు చేరుకుని సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. 


More Telugu News