Ukraine: ఉక్రెయిన్​ రైల్వే స్టేషన్​పై రష్యా దాడి... 22 మంది మృతి

  • మరో 50 మందికి గాయాలు
  • మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఉక్రెయిన్
    అధ్యక్షుడు  
  • రష్యా ఎన్ని దాడులు చేసినా వెనక్కి తగ్గబోమని స్పష్టీకరణ
22 killed and 50 injured in Russian strike on Ukraine rail station

నెలలు గడుస్తున్నా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది. రైల్వే స్టేషన్ పై చేసిన ఈ మెరుపు దాడిలో 22 మంది మృతి చెందారు. 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. యూఎన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌లో ఈ ఘటనను వివరించారు. అయితే, రష్యా ఎన్ని దాడులు చేసినా వెనక్కి తగ్గబోమని జెలెన్ స్కీ స్పష్టం చేశారు. 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాతోపాటు ఇతర ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.

యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు వీడియో ప్రసంగంలో జెలెన్ స్కీ మాట్లాడుతూ, తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత డోనెట్స్క్‌కు పశ్చిమాన 145 కి.మీ (90 మైళ్లు) దూరంలో ఉన్న చాప్లిన్ అనే చిన్న పట్టణంలో రష్యా రాకెట్లు రైలును ఢీకొన్నాయని చెప్పారు. నాలుగు క్యారేజీలు అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అత్యంత వినాశకరమైన సంఘర్షణ ఇది అన్నారు. రష్యా దళాలు ఉక్రెయిన్‌పై దాడి మొదలు పెట్టిన ఆరునెలల వ్యవధిలో తమ దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున రష్యా చేసిన ఈ దాడి అసహ్యమైనదన్నారు. తమను రెచ్చగొట్టే విధంగా ఉందని అన్నారు. రష్యా చేసిన ప్రతి దానికీ ఆ దేశం బాధ్యత వహించేలా చేస్తామన్నారు. 

1991లో సోవియట్ యూనియన్ పతనం అనంతరం ఉక్రెయిన్ ఏర్పడింది. ఆగస్టు నెలలో స్వాతంత్ర్య వేడుకలు జరుగుతున్నాయి. అయితే, రష్యా తాజా దాడి నేపథ్యంలో 24న వేడుకలను ప్రభుత్వం రద్దు చేసింది.  గత ఆరు నెలల నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించింది. అప్పటి నుంచి ఉక్రెయిన్‌లోకి రష్యా సైనిక దళాలు చొచ్చుకు వస్తున్నాయి. ఇప్పటికే కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాయిు. మరోవైపు ఉక్రెయిన్‌ కూడా దీటుగానే ప్రతిఘటిస్తోంది.

More Telugu News