నాగార్జున 'ది ఘోస్ట్' ట్రైలర్ ను సాయంత్రం విడుదల చేయనున్న మహేశ్ బాబు.. 'లైగర్' ఇంటర్వెల్ లో ప్లే కానున్న ట్రైలర్

  • హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టయినర్ గా తెరకెక్కిన 'ది ఘోస్ట్'
  • పవర్ ఫుల్ ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో నటించిన నాగార్జున
  • విలక్షణ దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం
  • అక్టోబర్ 5న విడుదలవుతున్న సినిమా
  • భారీ మొత్తానికి అమ్ముడుపోయిన ఓటీటీ రైట్స్
Nagarjuna The Ghost movie trailer out

కింగ్ నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'ది ఘోస్ట్'. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమాను ప్రవీణ్ సత్తారు హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టయినర్ గా తెరకెక్కించారు. ఇంటర్ పోల్ కు చెందిన ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాగార్జున నటించారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలను పోషించారు. 

ఇక ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ నాగార్జున సరసన నటించింది. శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టయిన్మెంట్స్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలిసి పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్క్ కే రాబిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. 

ఇప్పటికే ఈ సినిమాకు చెందిన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను ఈ సాయంత్రం విడుదల చేయనున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా సాయంత్రం 5.04 గంటలకు ట్రైలర్ విడుదల కానుంది. ఈ ట్రైలర్ ను ఈ రోజు విడుదలైన 'లైగర్' సినిమా ఇంటర్వెల్ లో ప్రదర్శించబోతున్నారు. 

ఈ సినిమాకు ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. నాగార్జున కెరీర్లోనే ఈ సినిమా ఓటీటీకి అత్యధిక మొత్తాన్ని చెల్లించినట్టు ఫిలింనగర్ టాక్. అక్టోబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

మరోవైపు, ఇప్పటికే ప్రవీణ్ సత్తారు సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. విలక్షణ దర్శకుడిగా టాలీవుడ్ లో ఆయన పేరొందారు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేసిన ప్రవీణ్ సత్తారు సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయన రూపొందించిన 'చందమామ కథలు' ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. 'లైఫ్ బిఫోర్ వెడ్డింగ్' సినిమాతో దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 

సినిమాల్లో పని చేసిన అనుభవం లేకుండానే, సినిమాలకు సంబంధించి ఎలాంటి కోర్సులు చేయకుండానే ఆయన ఇండస్ట్రీలోకి రావడం గమనార్హం. 'గుంటూరు టాకీస్', 'సీఎస్వీ గరుడవేగ' వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించి టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఒకరిగా ఆయన నిలిచారు. ఇప్పుడు నాగ్, ప్రవీణ్ కాంబినేషన్లో వస్తున్న 'ది ఘోస్ట్' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగ్ యాక్షన్ కు, ప్రవీణ్ సత్తారు దర్శకత్వ ప్రతిభ తోడు కావడంతో... ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

More Telugu News