Bilkis Bano case: బిల్కిస్ బానో కేసు: దోషుల విడుదలను సవాల్ చేస్తూ వచ్చిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో నేడే విచారణ

  • గుజరాత్ ప్రభుత్వ రిమిషన్ పాలసీ ప్రకారం విడుదలైన  11 మంది దోషులు 
  • విడుదలను సవాల్ చేసిన చట్టసభ సభ్యులు, మహిళా హక్కుల కార్యకర్తలు
  • విడుదలను రద్దు చేసి తనకు నిర్భయంగా, ప్రశాంతంగా జీవించే హక్కును తిరిగి ఇవ్వాలని కోరిన బాధితురాలు 
Will SC send Bilkis Bano 11 convicts back to jail Pleas to be heard today

బిల్కిస్ బానో గ్యాంగ్‌ రేప్ కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష కింద విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించనుంది. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మోయిత్రా, మహిళా హక్కుల కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్‌లను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 

ఈ కేసులో దోషులను విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, న్యాయవాది అపర్ణా భట్‌లు చేసిన వాదనలను ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. దీంతో, బిల్కిస్ బానో దోషులు తిరిగి జైలుకు వెళ్తారా? అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. 

2002 గోధ్రా అల్లర్ల సమయంలో గర్భవతిగా ఉన్న బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేయడంతో పాటు ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో 11 మంది నిందితులకు జనవరి 2008లో ముంబైలోని సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత బాంబే హైకోర్టు శిక్షను సమర్థించింది. 

అయితే, 15 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత దోషుల్లో ఒకరు రిమిషన్ పిటిషన్‌తో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం రిమిషన్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తన రిమిషన్ పాలసీ ప్రకారం జీవిత ఖైదు పడిన మొత్తం 11 మంది దోషులను విడుదల చేయడానికి గుజరాత్ ప్రభుత్వం అనుమతించింది. గత వారం గోద్రా సబ్ జైలు నుంచి దోషులు బయటకు వచ్చారు.

అయితే, బిల్కిస్ కేసు దోషుల విడుదలపై వివిధ పార్టీలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో దోషుల విడుదలను రద్దు చేయాలని ఉద్యమకారులు, చరిత్రకారులతో సహా 6,000 మందికి పైగా ప్రజలు సుప్రీంకోర్టును కోరారు.  11 మంది దోషులు విడుదలైన తర్వాత బిల్కిస్ బానో మాట్లాడుతూ 20 సంవత్సరాల కిందట అయిన గాయం తనను మళ్లీ వెంటాడుతోందని, దోషుల విడుదలను రద్దు చేసి తనకు నిర్భయంగా, ప్రశాంతంగా జీవించే హక్కను తిరిగి ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

More Telugu News