Vijayawada: విజయవాడ నుంచి బైక్‌పై పరారవుతున్న ప్రేమజంట.. వెనక సినీ ఫక్కీలో పోలీసుల ఛేజింగ్!

Police Chasing lovers overs 3 hours in vijayawada
  • అమ్మాయిది పెనమలూరు.. అబ్బాయిది విజయవాడ
  • పాఠశాల దశ నుంచే ఇద్దరి మధ్య స్నేహం
  • బైక్‌పై నేరుగా అమ్మాయి ఇంటికి వచ్చి ఎక్కించుకెళ్లిన అబ్బాయి
  • మూడున్నర గంటల ఛేజింగ్ తర్వాత పట్టుకున్న పోలీసులు
బైక్‌పై పరారవుతున్న ప్రేమ జంటను సినీ ఫక్కీలో మూడున్నర గంటలపాటు వెంబడించిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బైక్‌పై పరారైన అమ్మాయిది పెనమలూరు కాగా, అబ్బాయిది విజయవాడ. వీరిద్దరి మధ్య పాఠశాల దశ నుంచే స్నేహం ఉంది. వయసుతోపాటే స్నేహం కూడా పెరిగి ప్రేమకు దారితీసింది. అబ్బాయి బెంగళూరులో, అమ్మాయి విజయవాడలో ఇంజినీరింగ్ చదువుతున్నారు.

ఈ క్రమంలో ఆ అబ్బాయి బుధవారం బైక్‌పై అమ్మాయి ఇంటికి వచ్చాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న ఆమె అతడి బైక్ ఎక్కింది. అంతే.. క్షణాల్లోనే బైక్ పోరంకి మీదుగా కోల్‌కతా జాతీయ రహదారిపైకి దూసుకెళ్లింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటన నుంచి తేరుకున్న అమ్మాయి తల్లిదండ్రులు పెనమలూరు పోలీసులకు సమాచారం అందించారు. 

వెంటనే స్పందించిన సీఐ గోవిందరాజు ఇద్దరు కానిస్టేబుళ్లను పంపారు. అబ్బాయి సెల్‌ఫోన్‌ను ట్రాక్ చేస్తూ వాహనంపై బయలుదేరారు. దీంతో ముందు బైక్‌పై ప్రేమజంట.. వెనక పోలీసు వ్యాన్ ఛేజింగ్. సినీ ఫక్కీలో దాదాపు మూడున్నర గంటలపాటు ఈ ఛేజింగ్ సాగింది. చివరికి కొవ్వూరు టోల్ గేట్ వద్ద ఈ ఛేజింగ్‌కు బ్రేక్ పడింది. 

టోల్‌గేట్ వద్ద రద్దీ కారణంగా బైక్‌ను స్లో చేయడంతో వెనక నుంచి మెరుపు వేగంతో వచ్చిన పోలీసులు వారి బైక్‌కు తమ వాహనాన్ని అడ్డంపెట్టి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం ఇద్దరినీ పెనమలూరు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇద్దరూ మేజర్లు కావడంతో సీఐ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. జీవితంలో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నచ్చజెప్పి వారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Vijayawada
Penaluru
Lovers
Police
Chasing

More Telugu News